పేదలకు విస్కీ, బీర్ ఉచితంగా ఇస్తాం : మహిళా అభ్యర్థి హామీ
మహిళలు మద్యపానం నిషేధం చేయాలని చాలా ప్రాంతాల్లో కోరుకుంటూ ఉంటారు.
By Medi Samrat Published on 1 April 2024 9:08 AM ISTమహిళలు మద్యపానం నిషేధం చేయాలని చాలా ప్రాంతాల్లో కోరుకుంటూ ఉంటారు. వారి ఓట్లను దృష్టిలో పెట్టుకునే నాయకులు కూడా మద్యపాన నిషేధం చేస్తామంటూ ప్రకటనలను గుప్పిస్తూ ఉంటారు. అలాంటిది ఓ మహిళా అభ్యర్థి పేదలకు ఉచితంగా విస్కీ, బీర్ లాంటివి ఇస్తామని చెబితే మాత్రం ఎవరు మాత్రం ఏమి చేస్తారు చెప్పండి. తాజాగా మహారాష్ట్రలో ఓ మహిళా అభ్యర్థి పేదలకు విస్కీ, బీర్ ఇస్తామని హామీ ఇచ్చారు.
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని చిమూర్ గ్రామానికి చెందిన అభ్యర్థి వనితా రౌత్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో తాను ఎంపీని అయితే ప్రజలకు సబ్సిడీపై విస్కీ, బీరు అందజేస్తానని విచిత్రమైన ఎన్నికల వాగ్దానం చేసింది. అఖిల భారత మానవతా పార్టీ అభ్యర్థి వనితా రౌత్ తమ ప్రాంతంలోని పేద ఓటర్ల కోసం ఈ ఎన్నికల వాగ్దానాన్ని అందించారు. తాను విజయం సాధిస్తే ఎంపీ ఫండ్ నుంచి.. పేదలకు దిగుమతి చేసుకున్న విస్కీ, బీరు ఉచితంగా అందజేస్తానని చెప్పారు.
రేషన్ సిస్టమ్ ద్వారా దిగుమతి చేసుకున్న మద్యాన్ని ఇస్తామని తెలిపారు రౌత్. తాగేవారికి, అమ్మేవారికి లైసెన్స్ ఉండాలని అన్నారు. పేద ప్రజలు చాలా కష్టపడతారు.. మద్యపానంతో మాత్రమే సాంత్వన పొందుతారు. కానీ వారు నాణ్యమైన విస్కీ లేదా బీర్‌ను కొనుగోలు చేయలేరు. వారు కేవలం దేశీ మద్యాన్ని మాత్రమే తాగుతారు. అందుకే విదేశాల నుండి దిగుమతి చేసుకున్న మద్యాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నానన్నారు. మితిమీరిన మద్యపానం వల్ల కుటుంబాలు నాశనమవుతున్నాయనే విషయంపై వనితా రౌత్ ప్రతిస్పందిస్తూ.. మద్యం కొనుగోలు చేయడానికి ప్రజలకు కూడా లైసెన్స్ ఇవ్వాలని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. యుక్తవయస్సు వచ్చిన తర్వాత మాత్రమే మద్యం తాగడానికి ప్రజలకు లైసెన్స్ ఇవ్వాలని ఆమె సూచించారు.