డ్యాన్స్‌ వివాదం.. పెళ్లి రద్దు చేసుకున్న వరుడు.. పోలీసుల ఎంట్రీతో సీన్‌ రీవర్స్

పెళ్లిళ్లలో వధూవరుల పక్షాల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ఒక్కోసారి విషయం తీవ్రస్థాయికి చేరి గొడవలకు దారి తీస్తుంది.

By అంజి  Published on  2 Feb 2024 3:58 AM GMT
Uttar Pradesh, wedding,  marriage Quarrel

డ్యాన్స్‌ వివాదం.. పెళ్లి రద్దు చేసుకున్న వరుడు.. పోలీసుల ఎంట్రీతో సీన్‌ రీవర్స్

పెళ్లిళ్లలో వధూవరుల పక్షాల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ఒక్కోసారి విషయం తీవ్రస్థాయికి చేరి గొడవలకు దారి తీస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో అలాంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. డీజేలో డ్యాన్స్ విషయంలో పెళ్లికి వచ్చిన అతిథుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో వరుడు పెళ్లికి నిరాకరించాడు. తన బంధువులతో కలిసి తిరిగి స్వగ్రామానికి చేరుకున్నాడు. అయితే విషయం తెలిసిన వెంటనే పోలీసులు వరుడి గ్రామానికి చేరుకుని వారితో మాట్లాడారు. వరుడికి సర్ది చెప్పి పెళ్లికి ఒకే చెప్పించారు.

డ్యాన్స్‌ విషయంలో గొడవ

పెళ్లి ఊరేగింపు రాధా నగర్ పోలీస్ స్టేషన్‌లోని ఢకోలి గ్రామం నుండి ఫరీద్‌పూర్ మలుపు సమీపంలోని మ్యారేజ్ లాన్ వద్దకు వచ్చింది. పెళ్లికి సన్నాహాలు జరుగుతుండగా, డ్యాన్స్ విషయంలో పెళ్లికి వచ్చిన అతిథుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వరుడికి కోపం వచ్చింది. కోపోద్రిక్తుడైన వరుడు రంజిత్ పాశ్వాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి ఊరేగింపుతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయం పెళ్లి కూతురి తల్లిదండ్రులకు తెలియడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

పోలీసుల సమక్షంలో వివాహం..

దీంతో పెళ్లి కూతురి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఈ విషయాన్ని చెప్పారు. జరిగిన సంఘటనల క్రమాన్ని వివరించారు. జొనిహా పోలీస్ అవుట్‌పోస్టు ఇన్‌ఛార్జ్ సబ్-ఇన్‌స్పెక్టర్ అలోక్ కుమార్ తివారీ, తాను సమస్యను పరిశీలిస్తానని వధువు కుటుంబానికి హామీ ఇచ్చారు. అనంతరం తివారీ, మరో ముగ్గురు పోలీసులు ధకౌలి గ్రామంలోని వరుడి ఇంటికి చేరుకున్నారు. "పోలీసు బృందం వరుడి ఇంటికి చేరుకుని, వారితో మాట్లాడి, పెళ్లికి ఒప్పించింది" అని తివారీ చెప్పారు. పోలీసు బృందం రంజీత్ కుమార్‌గా గుర్తించబడిన వరుడిని, అతని కుటుంబ సభ్యులను తిరిగి వివాహ వేదిక వద్దకు తీసుకువచ్చి వారి సమక్షంలో వివాహం జరిపించారు. వధువు తండ్రి రాజ్ బహదూర్ తన కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిపిన పోలీసు బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అన్ని ఆచారాలు జరిగే వరకు పోలీసులు వివాహ వేదిక వద్దనే ఉన్నారు.

Next Story