ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఒక వధువుకు ఎక్కడ లేని కష్టాలు పెళ్లి రోజునే వచ్చాయి. వరుడు పెళ్లికి నిరాకరించడంతో అతని కోసం ఆమె ఏకంగా వెంటపడింది. సినిమా తరహాలో ఛేజ్ చేసి మరీ అతడిని తిరిగి పెళ్లి మండపం దగ్గరకు తీసుకుని వచ్చింది. పెళ్లి కొడుకును కనుగొని అతనిని వివాహం చేసుకోవడానికి 20 కిలోమీటర్లకు పైగా వెంబడించింది ఆ వధువు. రెండున్నరేళ్లుగా ప్రేమాయణం సాగింది.. అయితే పెళ్లికి ముందు కరెక్ట్ గా ఆ వరుడు పెళ్ళికి నిరాకరించాడు. వరుడు కనిపించడం లేదని మండపం వద్ద ఎదురుచూస్తూ కూర్చున్న వధువుకు తెలియగానే.. పెళ్ళికొడుకును వెతుక్కుంటూ వెళ్లాలని నిర్ణయించుకుంది.
చివరికి బరేలీ నగర పరిధిలోని పోలీస్ స్టేషన్ సమీపంలో బస్సులో వరుడు దొరికాడు. రెండు గంటల పాటు సాగిన నాటకీయ పరిణామాల తర్వాత, వధువు, ఆమె కుటుంబం, పెళ్ళికొడుకు కుటుంబం అతన్ని ఒక ఆలయానికి తీసుకెళ్లారు. వరుడి కుటుంబం వివాహానికి ఒప్పుకుంది. ఇద్దరూ బరేలీ నగరం దగ్గర ఉన్న ఆలయంలో వివాహం చేసుకున్నారు. వేడుకకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. సాధారణ దుస్తులలో వరుడు ఉండగా.. పెళ్లి కూతురు ముస్తాబై కనిపించింది. తన ప్రేమను కాపాడుకోడానికి ఆ యువతి చేసిన సాహసాన్ని పలువురు ప్రశంసిస్తూ ఉన్నారు.