బ్రహ్మచారికి బంపర్ ఆఫర్.. మద్దతు ఇస్తే పిల్లనిచ్చి పెళ్లి చేస్తాం
The political party gave the bumper Offer to bachelor.ప్రస్తుతం దేశంలో పెళ్లికాని బ్రహ్మచారిలు ఎక్కువయ్యారు
By తోట వంశీ కుమార్
ప్రస్తుతం దేశంలో పెళ్లికాని బ్రహ్మచారిలు ఎక్కువయ్యారు. చాలా మంది అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం లేదు. ఓ చోటా నేత పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. ఎన్ని సంబంధాలు చూసినా లాభం లేకపోయింది. ఇదే సమయంలో అక్కడ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే.. ప్రత్యర్థి నాయకుడికి మన చోటా నేత అవసరం పడింది. వెంటనే అతడికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తనకు మద్దతు ఇస్తే.. పిల్లనిచ్చి పెళ్లి చేస్తాం అని హామీ ఇచ్చాడు. ఇంకేముంది అప్పటి వరకు చాలా సంబంధాలు చూసి సెట్ కాక.. ఇబ్బంది పడుతున్న సదరు చోటా నేత వెంటనే ఒకే చెప్పేశాడట. పార్టీ మారేందుకు సిద్దమయ్యాడట. అతడికి నచ్చజెప్పేందుకు సీనియర్ నాయకులు ప్రయత్నించినా.. తనకు రాజకీయాల కంటే పెళ్లే ముఖ్యమని తేల్చి చెప్పాడట. దీంతో ఆశ్చర్యపోవడం సదరు పార్టీ నాయకుల వంతు అయింది.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. రామనగర్ జిల్లా కోడంబళ్లి అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 11న షెడ్యూలు ఖరారు చేశారు. బీసీ ఏ కేటగిరికి అధ్యక్ష స్థానం రిజర్వు అయింది. ఆ స్థానానికి కాంగ్రెస్ కు చెందిన ఓ వ్యక్తి రేసులో ఉన్నారు. అతనికి ఇదే పంచాయతీలో జేడీఎస్‌కు చెందిన వార్డు సభ్యుడు రవి మద్దతు అవసరమైంది. రవి బ్రహ్మచారి. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్ని సంబంధాలు చూసినా కుదరటం లేదు.
విషయం తెలుసుకున్న రామనగర్ జిల్లా గ్రామీణ కాంగ్రెస్ అధ్యక్షుడు 'మాకు మద్దతు ఇస్తే..నీకు మంచి పిల్లను చూసి పెళ్లి చేసే బాధ్యత మాది' అంటూ రవికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. దీంతో రవి సై అన్నాడు. దీంతో జేడీఎస్ నాయకులు ఖంగుతిన్నారు. పెళ్లి కోసం పార్టీకి వ్యతిరేకంగా పనిచేయొద్దంటూ హెచ్చరించారు. చివరికి మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చేత కూడా ఫోన్ చేయించారు. అయినా రవి ససేమిరా అన్నాడు. నాకు రాజకీయం కంటే పెళ్లే ముఖ్యమని చెప్పేశాడు. దీంతో ఖంగుతిన్న కుమారస్వామి అతడిపై వేటు వేయాలని సూచించగా.. స్థానిక నాయకత్వం మాత్రం వేచి చూద్దాం అన్న ధోరణిలో ఉన్నట్లు సమాచారం.