మీకు కరోనా రాకూడదా.. అయితే ఇలా చేయండి. వీటిని తినండి అంటూ సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అందులో చాలా వరకు ఫేక్ వీడియోలు అని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికి కొందరు వాటిని నమ్ముతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు మనం చూశాం. తాజాగా తమిళనాడు చెందిన ఓ వ్యక్తి పామును తింటే కరోనా రాదు అని ఓ పామును పట్టుకుని కసాబిసా కొరికి తినేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆగ్రహించిన అధికారులు అతడికి జరిమానా విధించారు.
వివరాల్లోకి వెళితే.. మధురై జిల్లా పెరుమపట్టికి చెందిన వడివేలు ఓ వ్యవసాయ కూలీ. యాభై ఏళ్ల వయసున్న వడివేలు ఓ రోజు చచ్చిన కట్లపామును పట్టుకుని డ్యాన్సులు చేశాడు. కరోనాకి విరుగుడు పామేనని.. దీనిని తింటే కరోనా రాదంటూ అరుస్తూ.. అందరూ చూస్తుండనే ఆ పామును నమిలి మింగేశాడు. ఈ తతంగాన్ని మొత్తం ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. జిల్లా ఫారెస్ట్ అధికారుల దాకా చేరడంతో సైబర్ పోలీసులను ఆశ్రయించారు. వడివేలుని గుర్తించి అరెస్ట్ చేయడంతో పాటు రూ.7వేల జరిమానా విధించారు. అదృష్టవశాత్తూ అతను విష గ్రంథిని కొరకలేదని అధికారులు వెల్లడించారు. కట్లపాము విషంలో న్యూరోటాక్సిన్స్ ఉంటాయని, అవి పక్షవాతాన్ని కలగజేస్తుందని ఫారెస్ట్ అధికారి ఒకరు వెల్లడించారు.