వామ్మో.. మ‌హిళ కంటిలోంచి వ‌స్తున్న రాళ్లు.. వారం రోజుల్లో 200కుపైనే

Stones are falling from the woman eye.ఓ మ‌హిళ కంట్లోంచి రాళ్లు వ‌స్తున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Dec 2022 8:45 AM IST
వామ్మో.. మ‌హిళ కంటిలోంచి వ‌స్తున్న రాళ్లు.. వారం రోజుల్లో 200కుపైనే

కళ్ల నుంచి నీళ్లు రావటం స‌హ‌జ‌మే. అయితే.. ఓ మ‌హిళ కంట్లోంచి రాళ్లు వ‌స్తున్నాయి. గ‌త శ‌నివారం నుంచి ఆ మ‌హిళ కంట్లోంచి రాళ్లు ప‌డుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 200 పైగా రాళ్లు వ‌చ్చాయి. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క రాష్ట్రంలోని మైసూర్‌లో చోటు చేసుకుంది.

హున్సూర్ తాలూకాలోని బిలికెరె హోబ్లీ బెంకిపూర్ గ్రామంలో విజ‌య‌(35) అనే మ‌హిళ త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తోంది. ఆమెకు గ‌త కొద్ది రోజులుగా ఎడ‌మ‌వైపు త‌ల‌నొప్పి వ‌స్తుంది. గ‌త శ‌నివారం నుంచి కంటిలోంచి రాళ్లు ప‌డుతున్నాయి. ఈ విష‌యం తెలుసుకున్న బెంకిపురా పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయురాలు జ‌రీనా తాజ్‌.. విజ‌య‌ను వెంట‌నే ప్ర‌భుత్వాసుప‌త్రికి తీసుకువెళ్లింది. కంటి ప‌రీక్ష‌లు చేయించింది. డాక్ట‌ర్లు ఆమెకు కంటి స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లు చెప్పారు. మెరుగైన వైద్యం కోసం మైసూరు తీసుకువెళ్లాల‌ని సూచించారు.

"వారం రోజుల క్రితం విప‌రీత‌మైన‌ త‌ల నొప్పి వ‌చ్చింది. త‌ల‌పై నుంచి ఏదో దొర్లిన‌ట్లుగా అనిపించింది. అప్ప‌టి నుంచి కంటిలో నీళ్ల‌తో పాటు రాళ్లు ప‌డుతున్నాయి. గ‌త శ‌నివారం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 200కు పైగా రాళ్లు కంటిలోంచి బ‌య‌ట‌కు వ‌చ్చాయి. రాళ్లు బ‌య‌ట‌కు వ‌చ్చే స‌మ‌యంలో కంటి నొప్పి వ‌స్తోంది. ఈ విష‌యాన్ని గ్రామ‌స్తుల‌కు చెబితే న‌న్ను న‌మ్మ‌లేదు. కొంద‌రు హేళ‌న చేశారు. అయితే..క‌న్ను మాత్రం బాగానే క‌నిపిస్తోంది. "అని విజ‌య చెప్పింది.

అయితే.. కంట్లోంచి రాళ్లు రావ‌డానికి ఖ‌చ్చిత‌మైన కార‌ణం తెలియ‌రాలేదు. పరిశోధ‌న కేంద్రాల‌కు రాళ్ల న‌మూనాల‌ను పంపిన‌ట్లు వైద్యులు తెలిపారు. ఆ ఫ‌లితాలు వ‌స్తేనే ఇలా ఎందుకు జ‌రిగింద‌నే విష‌యం తెలుస్తుంద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం ఈ వార్త అక్క‌డ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Next Story