21 రోజుల వయసు ఉన్న నవజాత శిశువు కడుపులో నుంచి ఎనిమిది పిండాలను వైద్యులు శస్త్ర చికిత్స చేసి తొలంగించారు. ఈ అత్యంత అరుదైన శస్త్రచికిత్స జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి. అక్టోబర్ 10న రాంచీలోని రామ్‌ఘర్‌లో ఓ మహిళ పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఇంటి కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు. అయితే.. శిశువు పొట్ట విపరీతంగా ఉబ్బిఉండడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. స్కానింగ్ చేసిన వైద్యులు.. శిశువు కడుపులో కణితులు ఉన్నట్లు బావించారు. 21 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అనంతరం నవంబర్ 1న పాపకు ఆపరేషన్ చేశారు.
అయితే.. శిశువు కడుపులో ఉన్నవి కణితులు కాదని, పిండాలని వైద్యులు నిర్థారించారు. గంటన్నర సేపు శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించారు.
కాగా.. ఇలాంటి కేసులు చాలా అరుదు అని వైద్యులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వందలోపే ఇలాంటి కేసులు ఉన్నాయన్నారు. ఆయా కేసుల్లో కడుపు నుంచి ఒక పిండాన్ని మాత్రమే తొలగించారని, అయితే.. 8 పిండాలను తొలగించడం ఇదే మొదటి సారి కావొచ్చునని వారు తెలిపారు.