డీజే, మందు లేకుండా పెళ్లిళ్లు చేయండి.. నగదు బహుమతి పొందండి..!

పంజాబ్‌లోని భటిండా జిల్లాలోని ఓ గ్రామంలోని గ్రామపంచాయతీ విశిష్ట నిర్ణయం తీసుకుంది.

By Medi Samrat  Published on  8 Jan 2025 4:14 PM IST
డీజే, మందు లేకుండా పెళ్లిళ్లు చేయండి.. నగదు బహుమతి పొందండి..!

పంజాబ్‌లోని భటిండా జిల్లాలోని ఓ గ్రామంలోని గ్రామపంచాయతీ విశిష్ట నిర్ణయం తీసుకుంది. వివాహ వేడుకల్లో డీజే, మద్యం వాడ‌ని కుటుంబాలకు రూ.21 వేలు నగదు అందజేస్తామని భటిండా జిల్లా బల్లో గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ ప్రకటించింది. డీజే, మద్యం ఉప‌యోగించ‌ని ఆ కుటుంబానికి పంచాయతీ ఈ మొత్తాన్ని ప్రోత్సాహకంగా ఇస్తుంది. గ్రామ సంక్షేమం కోసం, మాదకద్రవ్య వ్యసనానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే దానిపై సర్పంచ్ అమర్జీత్ కౌర్ సమగ్ర సమాచారం ఇచ్చారు.

బల్లో గ్రామ సర్పంచ్ అమర్జీత్ కౌర్ మంగళవారం మాట్లాడుతూ.. గ్రామస్తులు వివాహ వేడుకలకు దుబారా ఖర్చు చేయవద్దని, మద్యపానాన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సాధారణంగా గ్రామాల్లో మద్యం సరఫరా చేయడం, డిస్క్ జాకీల ద్వారా పెద్ద శబ్దంతో పాటలు ప్లే చేయడం చూస్తుంటామ‌ని అన్నారు. వాటితో గొడవలు జరుగుతాయి. అంతే కాకుండా బిగ్గరగా పాటలు వాయించడం వల్ల విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతుందని సర్పంచ్ అమర్జీత్ కౌర్ తెలిపారు. పెళ్లి వేడుకల్లో వృథా ఖర్చు చేయకుండా ప్రోత్సహించాలన్నారు. మద్యం సేవించని కుటుంబానికి, వివాహ వేడుకల్లో డీజే ఆడకుంటే రూ.21 వేలు ఇస్తామని పంచాయతీ తీర్మానం చేసిందని గ్రామ సర్పంచ్ తెలిపారు.

బల్లో గ్రామ జనాభా సుమారు 5,000. కౌర్‌ మాట్లాడుతూ.. యువత క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనేలా గ్రామంలో స్టేడియం నిర్మించాలని పంచాయతీ వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గ్రామంలో వివిధ క్రీడలు నిర్వహించేందుకు వీలుగా స్టేడియం ఉండాలని సర్పంచ్ తెలిపారు. గ్రామంలో బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని పంచాయతీ ప్రతిపాదించింది. సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులకు ఉచితంగా విత్తనాలు అందజేస్తామన్నారు.

Next Story