దేన్నైనా సృష్టించేది, నశింప చేసేది కూడా భగవంతుడే అని నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకే కరోనా అంతం జరగాలంటూ దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉన్నాయి. , ఆలయాలకు వెళ్లకపోయినా సరే వైరస్ నుంచి తమను కాపాడాలంటూ భారతీయులంతా తమ ఇష్ట దైవాలను ప్రార్ధిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తమిళనాడులో కోవిడ్ నుండి ప్రజలను రక్షించడానికి కరోనా దేవి విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. కోయంబత్తూరు జిల్లా ఇరుగూర్‌ కామాక్షిపురి ఆధీనం శక్తిపీఠంలో కరోనా మారియమ్మన్‌ ఆలయం నిర్మించి, అందులో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సెకండ్ వేవ్ ఉదృతం అవుతున్న నేపథ్యంలో, ఈ కరోనా అమ్మవారికి 48 రోజుల పాటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మహా యాగం జరుగుతుంది. అయితే ఈ సమయంలో ప్రజలు ప్రార్థనలు చేయడానికి, ఆలయాన్ని సందర్శించడానికి అనుమతించరు.

గతంలో ప్లేగు మరియు కలరా వ్యాప్తి సమయంలో దేవతలు పౌరులను రక్షించారని ఇక్కడి ప్రజల విశ్వాసం. 1900లో ప్లేగు వ్యాధి విస్తరించిన నేపథ్యంలో ఇలాగే ప్లేగు మరియమ్మన్ ఆలయం కూడా ఏర్పాటు చేశారు. దక్షిణ భారతదేశంలో కరోనా దేవికి అంకితం చేసిన రెండవ ఆలయం ఇది. గత ఏడాది జూన్‌లో కేరళలోని కొల్లం జిల్లాలోని కడక్కల్‌కు చెందిన ఒక పూజారి తన ఇంటి ప్రాంగణంలోని ఇలాగే ఓ దేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు.

సామ్రాట్

Next Story