ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్‌గా మారింది. రైలు దిగగానే ప్రయాణీకులు రైల్వే స్టేషన్‌లోంచి బయటకు పరుగులు తీస్తున్నారు. అయితే.. ఎవరైనా స్టేషన్‌లో బాంబు పెట్టారా..? లేదా ఏదన్నా.. ప్రమాదం జరిగిందా..? అందుకనే ప్రయాణీకులు అలా పరుగులు తీస్తున్నారేమో అని మీరు అనుకున్నట్లయితే.. మీరు పొరబడినట్లే. మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో అక్కడ లాక్‌డౌన్ విధిస్తారేమోన్న భయంతో వలస కూలీలు సొంత ప్రాంతాలకు తరలివెలుతున్నారు.
దీంతో రైల్వే స్టేషన్లు అన్ని వలస కార్మికులతో కిటకిటలాడుతున్నాయి. ఇక బీహార్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి బీహార్‌కు వచ్చే ప్రయాణీకులకు తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహించాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. అందుకనుగుణంగా అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కరోనా టెస్టులు చేస్తారో.. పాజిటివ్ వస్తే ఎక్కడ క్వారంటైన్ లో ఉండాల్సి వస్తుందో అనే భయమో తెలీదు గానీ.. బక్సర్ రైల్వే స్టేషన్‌లో రైలు దిగగానే ప్రయాణీకులు ఇలా ఆగకుండా పరుగులు తీశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.