చికెన్ ఎంత ప‌ని చేసింది.. పెళ్లి ఆగిపోయింది..!

Marriage halted due to not serve chicken in feast.చికెన్ కార‌ణంగా ఓ పెళ్లి ఆగిపోయింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Nov 2022 9:04 AM IST
చికెన్ ఎంత ప‌ని చేసింది.. పెళ్లి ఆగిపోయింది..!

సాధార‌ణంగా క‌ట్నం, లేదా ప్రేమ వ్య‌వ‌హారం కారణంగా ఆగిపోయిన పెళ్లిళ్లు చూసి ఉంటాం. అయితే.. చికెన్ కార‌ణంగా ఓ పెళ్లి ఆగిపోయింది. అవును మీరు చ‌దివింది నిజ‌మే. పెళ్లి కొడుకు స్నేహితుల‌కు చికెన్ వ‌డ్డించ‌లేద‌న్న కార‌ణంతో ఓ పెళ్లి ఆగిపోయింది. ఈ ఘ‌ట‌న ఎక్కెడో కాదు మ‌న హైద‌రాబాద్‌లోనే జ‌రిగింది.

వివ‌రాలు ఇలా ఉన్నాయి. జగద్గిరిగుట్ట రింగ్ బస్తీకి చెందిన ఓ యువకుడికి, కుత్బుల్లాపూర్‌కు చెందిన ఓ యువతితో వివాహం నిశ్చ‌య‌మైంది. సోమ‌వారం తెల్ల‌వారుజామున మూడు గంట‌ల ప్రాంతంలో వివాహా ముహూర్తాన్నినిర్ణ‌యించారు. షాపూర్‌న‌గర్‌లోని ఓ ఫంక్ష‌న్ హాల్‌లో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి విందును ఏర్పాటు చేశారు.

వధువుది బీహార్‌కు చెందిన మార్వాడీ కుటుంబం కావడంతో పెళ్లి విందులో అన్ని శాకాహార వంట‌కాల‌నే వ‌డ్డించారు. దాదాపుగా విందు పూర్తి కావొస్తుంద‌న్న త‌రుణంలో పెళ్లి కొడుకు స్నేహితులు భోజ‌నం చేసేందుకు అక్క‌డి వ‌చ్చారు. చికెన్ ఎందుకు పెట్ట‌డం లేద‌ని ఘ‌ర్ష‌ణ ప‌డి అక్క‌డ నుంచి వెళ్లిపోయారు. ఇది వధువు, వ‌రుడి కుటుంబాల మ‌ధ్య‌ గొడ‌వ‌కు దారి తీసింది. దీంతో నిన్న‌(సోమ‌వారం) జ‌ర‌గాల్సిన పెళ్లి ఆగిపోయింది.

వ‌ధువు కుటుంబ స‌భ్యులు జీడిమెట్ల పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. జీడిమెట్ల సీఐ ఇరు కుటుంబాల‌ను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంత‌రం వీరి వివాహాన్ని ఈ నెల 30న‌(బుధ‌వారం) చేయాల‌ని ఇరు కుటుంబాలు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చాయి.

Next Story