విమానంలో పెళ్లి.. లాక్ డౌన్ లో ఇలాంటి ఆలోచనలు కూడా వస్తున్నాయి

Madurai Couple Gets Married on Plane to Avoid Covid Restrictions. ఓ జంట ఏకంగా విమానంలో పెళ్లి చేసుకుంది. లాక్ డౌన్ నిబంధనలు ఉండడంతో విమానంలో పెళ్లి చేసుకుంది మధురైకు చెందిన ఓ జంట.

By Medi Samrat  Published on  24 May 2021 9:38 AM GMT
marriage

లాక్ డౌన్ సమయాల్లో కూడా పెళ్లిళ్లు చేసుకుంటున్న జంటలు ఎన్నో ఉన్నాయి. అయితే అతి తక్కువ మందితో పెళ్లిళ్లు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. దీంతో కేవలం అతి ముఖ్యమైన వారిని మాత్రమే పిలిచి.. మిగిలిన వారికి లైవ్ స్ట్రీమింగ్ లింక్స్ ఇస్తూ వస్తున్నారు.

ఇక ఈ లాక్ డౌన్ సమయంలో ఓ జంట ఏకంగా విమానంలో పెళ్లి చేసుకుంది. లాక్ డౌన్ నిబంధనలు ఉండడంతో.. విమానాన్ని అద్దెకు తీసుకుని విమానంలో పెళ్లి చేసుకుంది మధురైకు చెందిన ఓ జంట..! మధురై కు చెందిన జంట మధురై-బెంగళూరుకు విమానాన్ని బుక్ చేసుకుంది. అందులో కుటుంబ సభ్యులందరికీ టికెట్లను బుక్ చేశారు. అలా 161 సీట్లలో బంధువులు వచ్చి కూర్చున్నారు. విమానం ఆకాశం లోకి ఎగిరింది. ఆకాశంలో ఉండగా మంత్రోచ్చారణల మధ్య పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో తాళి కట్టాడు. మధురై మీనాక్షి అమ్మవారి గుడి చుట్టూ విమానం చక్కర్లు కొట్టింది.

రాకేష్-దక్షిణ.. ఇద్దరూ మధురైకు చెందిన వాళ్లే..! వీళ్లకు పెళ్లి నిశ్చయం అయింది. సాధారణంగా పెళ్లికి 20-50 మందికి మాత్రమే అనుమతులు ఉండడంతో తెలివిగా మధురై-బెంగళూరుకు విమానాన్ని బుక్ చేశారు. అలా విమానంలో 161 సీట్లలో బంధువులు కూర్చుని ఉండగా.. పెళ్లి తంతు జరిగింది. ఆ తర్వాత బెంగళూరు నుండి మధురైకు అదే విమానంలో తిరిగి చేరుకుంది ఈ పెళ్లి బృందం..! అలా వారి పెళ్లి తంతు కాస్త వెరైటీగా జరగడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్పైస్ జెట్ విమానాన్ని ఈ పెళ్లి బృందం అద్దెకు తీసుకుంది. ఈ పెళ్ళికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

ఇదిలావుంటే.. ఈ పెళ్లిలో కరోనా మార్గదర్శకాల అమలు ఎక్కడా కనిపించలేదని తెలియడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానంలో అతిథులు క్రిక్కిరిసి ఉండగా, వధూవరులకు మాస్కుల్లేకుండానే కనిపించడాన్ని డీజీసీఏ తప్పుబట్టింది. కరోనా నిబంధనలు పాటించకుండా ఇలాంటి కార్యక్రమాలు ఏంటని అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా విచారణకు ఆదేశించింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ స్పైస్ జెట్, ఎయిర్ పోర్ట్ వర్గాలను ఆదేశించింది. ఆ విమానంలోని స్పైస్ జెట్ సిబ్బందిని విధుల నుంచి తప్పించారు. నిబంధనలు పాటించకుండా విమానం ఎక్కిన పెళ్లి బృందంపై ఫిర్యాదు చేయాలంటూ స్పైస్ జెట్ ను డీజీసీఏ ఆదేశించింది.Next Story