Lottery : రూ.2.9కోట్ల లాటరీ గెలుచుకున్న వివాహిత.. భర్తకు తెలియకుండా మరో పెళ్లి
కుటుంబం కోసం భర్త విదేశాలకు వెళ్లాడు. ఖర్చుల కోసం ప్రతీ నెలా కొంత మొత్తాన్ని పంపేవాడు
By తోట వంశీ కుమార్ Published on 22 March 2023 9:48 AM ISTలాటరీ టికెట్లు ప్రతీకాత్మక చిత్రం
కుటుంబం కోసం భర్త విదేశాలకు వెళ్లాడు. ఖర్చుల కోసం ప్రతీ నెలా కొంత మొత్తాన్ని పంపేవాడు. అయితే.. ఇటీవల భార్య ఫోన్ ఎత్తడం మానేసింది. ఏం జరిగిందని ఆరా తీసిన సదరు భర్తకు దిమ్మతిరిగింది. తన భార్యకు 2 మిలియన్ బాట్ (భారత కరెన్సీలో రూ. 2.9 కోట్లు) లాటరీ తగిలిందని తెలుసుకున్నాడు. అంతేనా.. ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం తెలుసుకుని కంగుతిన్నాడు. తనకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించాడు.
థాయ్‌లాండ్ నరిన్, చవీవాన్ లు 20 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. వీరికి పెద్ద మొత్తంలో అప్పులు ఉండడంతో వాటిని తీర్చేందుకు 2014లో ఈ దంపతులు దక్షిణ కొరియాకు వెళ్లారు. అయితే.. పిల్లలను చూసుకునేందుకు చవీవాన్ థాయ్‌లాండ్‌కు తిరిగి వచ్చింది. అప్పటి నుంచి నరిన్ నెలకు భారత కరెన్సీలో రూ.70వేలకు పైగానే పంపేవాడు.
తన భార్య రూ. 2.9 కోట్ల లాటరీని గెలుచుకుందని, ఆ విషయాన్ని తన వద్ద దాచిందనే విషయాన్ని తెలుసుకున్నాడు. ఆమెకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో థాయ్‌లాండ్‌కు వచ్చాడు. అంతేనా..ఆమె ఓ పోలీసు అధికారిని పెళ్లి చేసుకుందన్న విషయం తెలుసుకుని కంగుతిన్నాడు.
"నేను షాక్ కు గురి అయ్యాను. ఏమి చేయాలో అర్థం కాలేదు. 20 సంవత్సరాల కాలంలో నా భార్య నన్ను ఇలా మోసం చేస్తుందని నేను ఏ రోజు ఊహించలేదు. ప్రతీ నెలా డబ్బులు పంపడంతో ప్రస్తుతం నా బ్యాంకు ఖాతాలో రూ.1.40లక్షలు మాత్రమే ఉన్నాయి. న్యాయం కోసం ఆమెపై దావా వేశా." అని అతడు వాపోయాడు. రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయం కనుక్కునే పనిలో పడ్డారు.