అదృష్టం అంటే ఈ కుక్కలదే.. ఘనంగా వివాహాం.. మనుషులకు కూడా ఇలా పెళ్లి జరగదేమో
Dogs married off in Uttar Pradesh's Hamirpur.జంతువులతో మనుషులకు ఉన్న బంధం విడదీయరానిది. కొందరు వాటిని
By తోట వంశీ కుమార్ Published on 7 Jun 2022 1:08 PM ISTజంతువులతో మనుషులకు ఉన్న బంధం విడదీయరానిది. కొందరు వాటిని తమ కుటుంబ సభ్యుల్లాగే బావిస్తుంటారు. ఇటీవల కాలంలో కొందరు వాటికి పుట్టిన రోజులు వేడుకలు చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే.. ఇక్కడో ఓ వ్యక్తి తాను పెంచుకుంటున్న కుక్క పిల్లకు పెళ్లి చేశాడు. అదేదో సాదాసీదా చేశాడు అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. ఎంతో ఘనంగా ఆ కుక్క కు వివాహాన్ని జరిపించాడు. బంధు మిత్రులను పిలిచి ఊరంతా భోజనాలు పెట్టించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హమీర్‌పూర్ జిల్లాలోని భరువా సుమెర్‌పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ పెళ్లి గురించి తెలుసుకున్న, చూసిన ప్రతిఒక్కరూ మనుషులకు కూడా ఇలా జరగదే అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
సౌంఖర్ అడవుల్లో మనసర్ బాబా శివ మందిరానికి చెందిన పూజారి ద్వారకా దాస్ మహరాజ్ ఓ మగ కుక్కను పెంచుకుంటున్నాడు. అతడు తన పెంపుడు కుక్క కు వివాహం చేయాలని అనుకున్నాడు. ఇందుకోసం పరఛాచ్ లోని బజరంగబలి ఆలయ పూజారి అర్జున్ దాస్ ను సంప్రదించాడు. అర్జున్ దాస్ పెంచుకుంటున్న ఆడ కుక్కతో వివాహం నిశ్చయించారు. జూన్ 5న ముహూర్తం పెట్టి.. తన శిష్యులకు, ప్రజలకు శుభలేఖలు అందించారు.
హిందూ వివాహ సాంప్రదాయాల ప్రకారం మగ, ఆడ కుక్కల పెళ్లి చేశారు. వివాహం అనంతరం 500 మందితో భారీ ఊరేగింపును నిర్వహించారు. ఇక పెళ్లికి వచ్చిన అతిథులకు పది రకాలకుపైగా వంటకాలను వడ్డించారు. ఇక అతిథులు కూడా రూ.11వేలు చదివింపుల కింద అందజేశారు. ఓ ధనికుడి కుటుంబంలోని వ్యక్తి పెళ్లి ఎలాగైతే చేస్తారో అలాగే వీటి వివాహాం జరగడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.