మొన్న క్షమా బిందు.. ఇప్పుడు ఈ నటి
Diya Aur Baati Hum Fame Kanishka Soni Marries Herself. సోలోగమీ.. కొద్దిరోజుల కిందట క్షమా బిందు అనే యువతి తనను తానే పెళ్లి చేసుకుని
By Medi Samrat Published on 20 Aug 2022 3:01 PM IST
సోలోగమీ.. కొద్దిరోజుల కిందట క్షమా బిందు అనే యువతి తనను తానే పెళ్లి చేసుకుని దేశంలో సంచలనం సృష్టించింది. 24 ఏళ్ల క్షమా బిందు ప్రస్తుతం వడోదరాలో ఉంటోంది. తన పెళ్ళికి సంబంధించి వెడ్డింగ్ కార్డులు కూడా ప్రింట్ చేయించింది. ఆలయంలో ఆమె పెళ్లిని ఒప్పుకోకపోవడంతో తన ఇంట్లోనే పెళ్లితంతు కానిచ్చేసింది. క్షమా బిందు చేసిన సోలోగమీ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరేమో ఆమెను సపోర్ట్ చేస్తే మరికొందరేమో తిట్టిపోశారు. గుడిలో పెళ్లి చేసుకోవాలని క్షమా బిందు నిర్ణయించగా.. దీనిపై స్థానిక బీజేపీ మహిళా నాయకురాలు అభ్యంతరం తెలిపారు. ఆలయంలో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదన్నారు. మంత్రాలను ప్లే చేస్తూ ఆమె పెళ్లి ఆమె చేసుకుంది.
ఇప్పుడు ప్రముఖ నటి కనిష్కా సోనీ కూడా అదే బాటలో ప్రయాణించింది.ఇటీవల ఆమె నుదుటన సింధూరం, మెడలో మంగళసూత్రంతో ఉన్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. దీంతో అభిమానులు ఆరా తీయగా.. తనను తానే పెళ్లి చేసుకున్నట్టు చెబుతూ అభిమానులకు షాకిచ్చింది. తాను గుజరాతీ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చానని, పెళ్లి అనేది తన చిరకాల కోరిక అని తెలిపింది. తన జీవితంలో మాటమీద నిలబడే ఒక్క పురుషుడు కూడా కనిపించలేదని, అందుకనే పురుషుడి తోడు లేకుండానే జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నానని వివరించింది. తన అవసరాలను తానే తీర్చుకోగలనని, కలలను నెరవేర్చుకోగలనని చెప్పింది. నటి ఇచ్చిన షాక్ నుండి అభిమానులు ఇంకా తేరుకోలేకపోతున్నారు.