ట్విస్టులే ట్విస్టులు.. కాబోయే కోడలే కూతురు.. భర్తే అన్నయ్య.. అయినా పెళ్లి చేశారు
China women find the bride is her daughter. పెళ్లి కుమారుడి తల్లి పెళ్లి కాబోయేముంది కోడలిని చేతి మీద పుట్టు మచ్చను చూసి తప్పిపోయిన తన కూతురు అని తెలిసి షాక్.
By తోట వంశీ కుమార్ Published on 6 April 2021 12:09 PM GMTమరికొద్దిసేపటిలో పెళ్లి జరగనుంది. దీంతో అక్కడ అంతా హడావుడి మొదలైంది. ఇంతలో పెళ్లి కుమారుడి తల్లి.. అతడికి కాబోయే భార్యను పరీక్షగా చూసింది. ఆమె చేతి మీద కనిపించిన పుట్టుమచ్చ చూసి షాకైంది. ఎందుకంటే.. ఆ యువతి 20ఏళ్ల క్రితం తప్పిపోయిన తన కుమారై కావడమే అందుకు కారణం. దీంతో తల్లి హృదయం ఉప్పొంగింది. అయితే.. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. తాను అన్నను పెండ్లాడుతున్నానని తెలిసి.. ఆ పెండ్లి కుమార్తె కలత చెందినప్పటికి.. చివరికి అతడినే వివాహం చేసుకుంది. ఈ ఘటన చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో మార్చి 31 చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. ప్రావిన్స్ చెందిన ఓ మహిళ కుమారై 20 ఏళ్ల క్రితం తప్పిపోయింది. కాగా.. ఇటీవల తన కుమారుడి వివాహాన్ని మార్చి 31 చేయాలని నిర్ణయించింది. ఆ రోజు పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తైయ్యాయి. మరికొద్దిసేపటిలో వివాహం జరగనుందగా.. కాబోయే కోడలి చేతి మీద ఉన్న పుట్టుమచ్చ చూసి షాకైంది. వెంటనే అనుమానం వచ్చి వధువు తల్లిదండ్రులను పిలిచి ప్రశ్నించింది. వారు కొద్ది సేపు ఆలోచించి అన్నిరోజులు ఆ యువతికి తెలియకుండా దాచిన రహస్యాన్ని వెల్లడించారు. పిల్లలు లేని వారికి ఆ యువతి 20 ఏళ్ల క్రితం దొరికిందని.. ఆమెను పెంచి పెద్దచేశామన్నారు. దీంతో ఆ యువతినే తన కూతురు అని తెలిసి ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తల్లి కుమారైలు ఇద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు.
ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ఇక్కడో ఇంకో చిక్కు వచ్చి పడింది. ఇంకో గంటలో పెళ్లి అనగా.. పెళ్లి కొడుకే తన అన్నయ్య అని తెలిసి ఆ యువతి ఆవేదన చెందింది. అయితే.. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెండ్లి కొడుకు తన సంతానం కాదని.. తాను అతడిని దత్తత తీసుకున్నానని మహిళ పేర్కొనడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వారి వివాహాన్ని ఎంతో ఘనంగా జరిపించారు. పెళ్లి వేడుకకు వచ్చిన వారు తొలుత ఆశ్చర్యపోయిన.. నవ దంపతులు ఆనందంగా ఉండాలని ఆశీర్వదించారు. కాగా.. ఈ ఘటనపై పెళ్లి కుమారై స్పందిస్తూ.. జీవితంలో తనకు ఇదో మధుర జ్ఞాపకమని చెప్పింది. పెళ్లి కంటే కూడా.. తన తల్లిని తాను కలుసుకోవడమే అన్నింటికన్నా గొప్పదని చెప్పింది.