ఇదేందీ సామీ.. అమ్మాయిలను వద్దు అన్నారని.. ఆ ప్రకటనల్లోనూ అబ్బాయిలే..!
ఆన్‌లైన్‌లో లో దుస్తుల ప్రకటనల్లో అమ్మాయిలను నిషేదించడంతో వారి స్థానంలో అబ్బాయితో ప్రకటనలు చేయిస్తున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 4 March 2023 10:06 AM ISTఆన్‌లైన్‌లో లో దుస్తుల ప్రకటనల్లో అమ్మాయిలను నిషేదిస్తూ ప్రభుత్వం ఓ చట్టం తీసుకువచ్చింది. దీంతో లోదుస్తుల వ్యాపారులు నష్టాలను మూటగట్టుకున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తూనే నష్టాల నుంచి బయటపడేందుకు ఓ ఉపాయాన్ని ఆలోచించారు. మహిళల స్థానంలో పురుష మోడళ్లను ఉంచి ప్రకటనలు చేస్తున్నారు. మహిళల లో దుస్తులను ధరించి పురుష మోడళ్లు చేస్తున్న ప్రకటనలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
లో దుస్తులకు సంబంధించిన ఆన్‌లైన్ ప్రకటనల్లో అమ్మాయిలు ఉండటం వల్ల అశ్లీలత పెచ్చుమీరుతోందన్న ఉద్దేశ్యంతో చైనా ప్రభుత్వం వీటిపై నిషేదం విధించింది. ఆన్‌లైన్ ప్రచారాలకు మహిళలను ఉపయోగించకుండా ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చింది. దీంతో లోదుస్తుల ప్రచారం ఎలా చేయాలో అక్కడి వ్యాపారులకు అర్థం కాలేదు. ఫలితంగా నష్టాలను మూటగట్టుకున్నారు.
దీనికి ఏదైన పరిష్కారాన్ని ఆలోచించాలని కొందరు వ్యాపారులు బావించారు. ఓ సరికొత్త ఐడియాతో ముందుకు వచ్చారు. అమ్మాయిలపై నిషేదం విధించారు గానీ అబ్బాయిలపై కాదు కదా. అమ్మాయిల లో దుస్తులను అబ్బాయిలతో ధరింపజేసి యాడ్స్ చేశారు. ఇది కొంత వరకు మంచి ఫలితాలనే ఇచ్చింది.
ఇంకేముంది మిగతా వారు కూడా అదే బాటలో పయనించారు. ప్రస్తుతం అమ్మాయిల లో దుస్తులను ధరించిన పురుష మోడల్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఆ దుస్తులు అమ్మాయిల కంటే.. అబ్బాయిలు వేసుకుంటేనే బాగుంది కదా అని ఓ యూజర్ కామెంట్ చేయగా, షేక్స్ స్పియర్ కాలంలోనూ ఇలాగే ఉండేదని మరో యూజర్ కామెంట్ చేశాడు.