ఏప్రిల్ 1వ తేదీ రోజే 'ఫూల్స్ డే' ఎందుకు జరుపుకుంటారు..?
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఒకరిని ఒకరు సరదాగా ఆటపట్టిస్తూ ఈ రోజును ఏప్రిల్ ఫూల్స్ డేగా జరుపుకుంటారు.
By - Medi Samrat |
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఒకరిని ఒకరు సరదాగా ఆటపట్టిస్తూ ఈ రోజును ఏప్రిల్ ఫూల్స్ డేగా జరుపుకుంటారు. ఆ రోజు మనకు ఉల్లాసంగా, సంతోషంగా ఉండటం నేర్పుతుంది. మన తీరికలేని జీవితాలలో కొద్దిపాటి తేలికదనం, వినోదం అవసరం.
అయితే ఈ తేదీని ఫూల్స్ డేగా ఎందుకు ఎంచుకున్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా.? ఏప్రిల్ ఫూల్స్ డేను ఏప్రిల్ 1వ తేదీనే ఎందుకు జరుపుకుంటారు? ఈ సంప్రదాయం ఎప్పుడు, ఎలా మొదలైంది? ఈ ప్రశ్నలు మీ మనసులో మెదిలి ఉండే ఉంటాయి. ఈ సంప్రదాయం వెనుక ఎన్నో ఆసక్తికరమైన కథలు, చారిత్రక కారణాలు ఉన్నాయి. ఏప్రిల్ ఫూల్స్ డే చరిత్ర, ప్రాముఖ్యత, నమ్మకాల గురించి తెలుసుకుందాం..
ఏప్రిల్ 1వ తేదీ వేడుక ఫ్రాన్స్‌లో ప్రారంభమైంది. ఏప్రిల్ ఫూల్స్ డేకి సంబంధించిన అత్యంత ప్రాచుర్యం పొందిన కథ ఫ్రాన్స్‌తో ముడిపడి ఉంది. 16వ శతాబ్దంలో 1564లో చార్లెస్ IX ఒక కొత్త క్యాలెండర్‌ను ప్రవేశపెట్టాడు, దీని ప్రకారం నూతన సంవత్సరం జనవరి 1న ప్రారంభమయ్యేది. అయితే, చాలా మందికి ఈ మార్పు గురించి తెలియక, నూతన సంవత్సరాన్ని ఏప్రిల్ 1వ తేదీనే జరుపుకోవడం కొనసాగించారు. అలాంటి వారిని ఎగతాళి చేయడానికి, వారిని ఏప్రిల్ ఫూల్స్ అని పిలిచేవారు.
యూరప్‌లో నూతన సంవత్సర దినోత్సవాన్ని మొదట్లో మార్చి నెలాఖరు నుండి ఏప్రిల్ ఆరంభం వరకు జరుపుకునేవారు. కొత్త క్యాలెండర్‌ను ప్రవేశపెట్టినప్పుడు తేదీ మారింది.. కానీ తెలియక పాత సంప్రదాయాన్ని కొనసాగించిన వారు అపహాస్యానికి గురయ్యారు.
అయితే, ఏప్రిల్ ఫూల్స్ డే గురించి ఇతర సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. కొందరు దీనిని ప్రాచీన రోమన్ పండుగ అయిన హిలారియాతో ముడిపెడితే, మరికొందరు దీనిని మారుతున్న రుతువులతో, వసంతకాలపు ఆనందాలతో ముడిపెడతారు.
ఈ రోజున, ప్రజలు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులతో సరదాగా చిలిపి పనులు చేస్తుంటారు. కొన్నిసార్లు, వార్తా ఛానెళ్లు, వెబ్‌సైట్లు కూడా ఫన్నీ వార్తలను ప్రసారం చేసి ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి.