ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ మహిళ పెళ్లయిన 40 రోజులకే తన భర్త నుంచి విడాకులు కోరింది. కారణం భర్త రోజూ స్నానం చేయడం లేదని. మహిళ ప్రకారం.. ఆమె భర్త నెలకు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే స్నానం చేస్తాడు. ఇది అతనికి అసహ్యకరమైన శరీర వాసన కలిగిస్తుంది. ఇంత అధ్వాన్నమైన పరిశుభ్రత పాటించే వ్యక్తితో తాను జీవించలేనని ఫిర్యాదు చేస్తూ ఆగ్రాలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆ మహిళ ఆశ్రయించింది.
సదరు మహిళ భర్తను అధికారులు ప్రశ్నించగా.. అతని సమాధానం విని ఆశ్చర్యపోయారు. అతను సాధారణంగా నెలకు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే స్నానం చేస్తానని, వారానికి ఒకసారి తన శరీరంపై గంగాజల్ (గంగా నది నుండి నీరు) చల్లుకుంటానని చెప్పాడు. అయితే తమ పెళ్లయిన 40 రోజులలో భార్య పట్టుబట్టడంతో ఆరుసార్లు స్నానం చేశానని చెప్పాడు. పెళ్లయిన కొద్ది వారాల్లోనే దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం మొదలైందని, ఆ తర్వాత మహిళ తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చిందని ఫ్యామిలీ సెంటర్‌లోని కౌన్సెలర్ తెలిపారు.
అనంతరం ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో వరకట్న వేధింపులపై ఫిర్యాదు చేసి విడాకులు కోరింది. పోలీసులతో చర్చించిన తర్వాత, రాజేష్ తన పరిశుభ్రతను మెరుగుపరచడానికి, రోజూ స్నానం చేయడానికి అంగీకరించాడు. అయితే, అతని భార్య అతనితో కలిసి జీవించడానికి ఇష్టపడలేదు. తదుపరి పరిష్కారం కోసం సెప్టెంబరు 22న కౌన్సెలింగ్ కేంద్రానికి తిరిగి రావాలని దంపతులకు సూచించబడింది