Fact Check : ఒబామా, డాక్టర్ ఫసీ వుహాన్ ల్యాబ్ ను 2015 లోనే సందర్శించారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 July 2020 7:16 AM ISTవుహాన్ ల్యాబ్.. కరోనా వైరస్ పుట్టింది ఇక్కడే అని ఎంతో మంది ఆరోపిస్తూ ఉన్నారు. చైనా కరోనా మహమ్మారిని వుహాన్ ల్యాబ్ లో సృష్టించి అది ప్రపంచం మీదకు వదిలిందని వారి వాదన. 2015లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా వుహాన్ ల్యాబ్ కు వెళ్లారని, ఆయనతో పాటూ డాక్టర్ ఆంటోనీ ఫసీ, మెలిందా గేట్స్ కూడా ఉన్నారని చెబుతూ కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.
'This our very own Dr Fauci with Melinda Gates and President Barack Obama at the Wuhan Labs in 2015.’ అంటూ కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ఉన్నారు. వుహాన్ ల్యాబ్ లో ట్రంప్ కు ఏమి అవసరం ఉంది అంటూ పలువురు ట్విట్టర్ లో ప్రశ్నలు వేశారు. డాక్టర్ తో పాటూ అతడి బాస్ ఒబామా కూడా 2015లో వుహాన్ ల్యాబ్ ను సందర్శించారని.. వీటి వెనుక ఏమైనా కుట్రలు ఉన్నాయా అంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు.
I missed the md or PhD after your name. Oh, it’s because it’s not there.
— Steverino (@CookieDuster) July 16, 2020
నిజ నిర్ధారణ:
ఒబామా, డాక్టర్ ఆంటోనీ ఫసీ, మెలిందా గేట్స్ కలిసి వుహాన్ ల్యాబ్ ను సందర్శించారన్నది పచ్చి అబద్ధం.
ఈ ఫోటోలకు సంబంధించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ తో పాటూ, “Obama tours lab” అన్న కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా అదే ఫోటో https://obamawhitehouse.archives.gov/ లో లభించింది. “President Obama tours a lab at the Vaccine Research Center at the National Institute of Health”. అనే టైటిల్ ను ఆ ఫోటోకు ఉంచారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ లోని వ్యాక్సిన్ రీసర్చ్ సెంటర్ కు ఒబామా వెళ్లినప్పటి ఫోటో అది.
ఆ ఫోటో సమాచారంలో బరాక్ ఒబామా, హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రెటరీ సిల్వియా మ్యాథ్యూస్ బర్వెల్, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డాక్టర్ ఆంటోనీ ఫాసీ కలిసి బెతెస్డా, మేరీల్యాండ్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ లోని వ్యాక్సిన్ రీసర్చ్ సెంటర్ ను డిసెంబర్ 2, 2014 న సందర్శించారు. ఛీఫ్ బయోడిఫెన్సు రీసర్చ్ సెక్షన్ సీనియర్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ నాన్సీ సల్లివాన్ ఎబోలా వైరస్ వ్యాక్సిన్ గురించి ఒబామాకు వివరిస్తూ ఉంది.
Reuters వార్తా సంస్థలో కూడా ఒబామా ల్యాబ్ కు వెళ్లినట్లు కథనాన్ని కూడా ప్రచురించింది. “Obama toured a lab at the National Institute of Health, where a team of researchers last week published promising results from the first phase of a research trial for an Ebola vaccine.” అని చెబుతూ వార్తను ప్రచురించింది.
బరాక్ ఒబామా, డాక్టర్ ఫసీ తో కలిసి వెళ్లిన మహిళ మెలిందా గేట్స్ కాదు.. ఆ ఫొటోలో ఉన్నది హ్యూమన్ సర్వీసెస్ సెక్రెటరీ సిల్వియా మ్యాథ్యూస్. ఒబామా మాట్లాడుతున్న మహిళ 'డాక్టర్ నాన్సీ సల్లివాన్'. ఆమె ఇప్పుడు బియోడిఫెన్స్ రీసర్చ్ సెక్షన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కు చీఫ్ గా వ్యవహరిస్తున్నారు.
బరాక్ ఒబామా, సిల్వియా మ్యాథ్యూస్, ఆంటోనీ ఫాసీ కలిసి మేరీల్యాండ్, అమెరికా లోని వ్యాక్సిన్ రీసర్చ్ సెంటర్ కు వెళ్లిన ఫోటో అది. అంతేకానీ చైనా లోని వుహాన్ ల్యాబ్ కు చెందినది కాదు. ఒబామా, డాక్టర్ ఆంటోనీ ఫసీ, మెలిందా గేట్స్ కలిసి వుహాన్ ల్యాబ్ ను సందర్శించారని పెట్టిన పోస్టులు పచ్చి అబద్ధం.