ఒక రోజు మొత్తం అమ్మాయిల హాస్టల్‌లోనే.. మంచం కింద పడుకొని..

By అంజి  Published on  22 Feb 2020 12:01 PM GMT
ఒక రోజు మొత్తం అమ్మాయిల హాస్టల్‌లోనే.. మంచం కింద పడుకొని..

కృష్ణా: నూజివీడు ట్రిపుల్‌ ఐటీ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. హాస్టల్‌లో విద్యార్థిని రూమ్‌లో ఉన్న అబ్బాయి కూడా ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిగా గుర్తించారు. ఇద్దరూ పీయూసీ రెండో ఏడాది చదువుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇద్దరు విద్యార్థులపై ట్రిపుల్‌ ఐటీ అధికారులు ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇద్దరు విద్యార్థులకు కేవలం కౌన్సిలింగ్‌ ఇచ్చి ఇళ్లకు పంపారు. ఈ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీకి పంపుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి క్రమ శిక్షణ కమిటీ సోమవారం నిర్ణయం తీసుకోనుంది.

నూజీవీడు ట్రిపుల్ ఐటీలోని అమ్మాయిల హాస్టల్లో కలకలం రేగింది. ఓ యువకుడు విద్యార్థినుల హాస్టల్‌లోకి ప్రవేశించాడు. ఒక రోజంతా హాస్టల్‌లోనే యువకుడు ఉన్నాడు. అమ్మాయిల హాస్టల్లోని మంచం కింద పడుకున్న ఓ యువకుడు సెక్యూరిటీకి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఐటీ కాలేజీలో గత కొన్ని రోజులుగా ఫెస్ట్‌ నిర్వహిస్తున్నారు. దీంతో ఐటీ కాలేజీ అధికారులు, సిబ్బంది అంతా ఆ పనుల్లోనే నిమగ్నమయ్యారు. ఆ విద్యార్థి అమ్మాయిల హాస్టల్‌లో దూరిపోయాడు.

విషయం తెలిసిన కూడా విద్యార్థులు.. కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకురాలేదు. ఎలాగోలా మేనెజ్‌మెంట్‌కు ఈ విషయం తెలిసింది. వెంటనే ఆ హాస్టల్‌ గదికి వేసి ఉన్న తాళాన్ని సెక్యూరిటీ సిబ్బంది పగలగొట్టారు. గదిలోని అన్ని మంచాలను పక్కకు జరిపారు. ఓ మంచం కింద పడుకున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు విద్యార్థినిలను సస్పెండ్‌ చేసినట్లు సమాచారం. ఈ విషయం వెలుగులోకి వచ్చాక భద్రతా వైఫల్యం పై విద్యార్థినుల ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఏటా లక్షలు పోసి తమ అమ్మాయిలను హాస్టళ్లో చదివిస్తుంటే.. అధికారులు భద్రతను గాలికి వదిలేశారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story
Share it