మహారాష్ట్రలో నెంబర్‌ గేమ్‌..!

By అంజి  Published on  23 Nov 2019 9:20 AM GMT
మహారాష్ట్రలో నెంబర్‌ గేమ్‌..!

ముఖ్యాంశాలు

  • మహారాష్ట్రలో మొదలైన నెంబర్‌ గేమ్‌
  • మాకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది: శరద్‌ పవార్‌
  • అజిత్‌ పవార్‌ నిర్ణయం విస్మయానికి గురిచేసంది: శరద్‌ పవార్‌
  • మహారాష్ట్రలో బీజేపీ సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసింది: ఉద్దవ్‌ ఠాక్రే

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో రాత్రికి రాత్రే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ ఆడిన పొలిటికల్‌ మైండ్‌ గేమ్‌తో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు షాక్‌ తిన్నాయి. తెల్లారితే పగ్గాలు చేపడదామనుకున్న శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీలకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. అధికారం చేపట్టే కొద్ది గంటల్లోనే రాజకీయం పూర్తిగా మారిపోయింది. మహరాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేందర్ ఫడ్నవీస్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీ చీలిక వర్గానికి కి చెందిన అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ కోష్యారీ ప్రమాణస్వీకారం చేయించారు. అందరి అంచనాలూ తలకిందలు చేస్తూ బీజేపీ - ఎన్సీపీ చీలిక వర్గం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

ఇదిలా ఉంటే మహారాష్ట్రలో బీజేపీ సర్కార్‌ ఏర్పాటు చేయడంపై ఎన్సీపీ, శివసేన మీడియా ముందుకు వచ్చాయి. శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ కూటమిగా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించామని శరద్‌పవార్‌ పేర్కొన్నారు. మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని.. మాకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శరద్‌ పవార్‌ తెలిపారు. అజిత్‌ పవార్‌ నిర్ణయం విస్మయానికి గురిచేసందని.. తాను నీతిమాలిన చర్యకు పాల్పడ్డారన్నారు. బీజేపీకి అజిత్‌ పవార్‌ మద్దతు ఆయన వ్యక్తిగతమన్న శరద్‌పవార్‌.. అజిత్‌తో వెళ్లే ఎమ్మెల్యేలు ఫిరాయింపు నిరోధక చట్టం ఉందని తెలుసుకోవాలన్నారు. అజిత్‌ పవార్‌ వెంట ఉన్న ఉన్న ఎమ్మెల్యేలపై వేటు తప్పదన్నారు.

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తేసినట్టు ఇవాళ ఉదయం 6.30 నిమిషాలకు శరద్‌ పవార్‌ వెల్లడించారు. అజిత్‌ పవార్‌తో 10-11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని.. మిగతా ఎమ్మెల్యేలంతా మాతో టచ్‌లో ఉన్నారని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలూ కూడా మాకు మద్దతిచ్చారన్నారు. పార్టీ క్రమశిక్షణను అజిత్‌ ఉల్లంఘించారు. అజిత్‌ పవార్‌పై పార్టీ పరమైన చర్యలుంటాయన్నారు. బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకోవాలని శరద్‌ పవార్‌ అన్నారు. సాయంత్రం జరిగే ఎన్సీపీ శాసనసభా పక్ష సమావేశంలో అజిత్‌ పవార్‌ తొలగింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

మహారాష్ట్రలో బీజేపీ తీరుపై శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. బీజేపీ అన్ని నిబంధనలను అతిక్రమించిందన్నారు. త్వరలోనే బీజేపే గేమ్‌ తప్పకుండా బహిర్గతమవుతుందన్నారు. బీజేపీ అధికారం కోసం పార్టీల మధ్య చీలిక తేస్తోందని ఉద్దవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో బీజేపీ సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసిందని అభిప్రాయపడ్డారు. బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని.. హర్యానా, బిహార్‌లోనూ ఇదే చేసిందని ఉద్దవ్ ఠాక్రే ధ్వజమెత్తారు.

నెంబర్‌ గేమ్‌

మహారాష్ట్రలో నెంబర్‌ గేమ్‌ మొదలైంది. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పార్టీలు యత్నిస్తున్నాయి. ఎన్సీపీ చీలిక వర్గం సంఖ్యాబలంపై వేర్వేరు అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్‌ ఫిగర్‌ 145. ఎన్సీపీ చీలిక వర్గం, శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్లు తమవైపే ఉన్నారని బీజేపీ చెప్పుకొస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో బల నిరూపణ జరిగే వరకు క్యాంపు రాజకీయాలు ఆస్కారం ఏర్పడింది. దీంతో ఎమ్మెల్యేలకు డబ్బు, పదవులతో పార్టీలు ఎర వేస్తున్నాయి.

Next Story