అణు యుద్ధం వస్తే..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Sept 2019 8:28 PM ISTఆర్టికల్ 370 రద్దు తరువాత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అణు యుద్ధం గురించి మాట్లాడుతున్నారు. సాంప్రదాయ యుద్ధంలో భారత్ తప్పక గెలుస్తుందని.. ఆ పరిస్థితే వస్తే తమ మనుగడను కాపాడుకోవడానికి అణు బాంబులు ప్రయోగిస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు ఇమ్రాన్ ఖాన్. ఇక..భారత్ కూడా ఫస్ట్ తాము అణు బాంబ్ ప్రయోగించమనే మాటను పరిశీలిస్తామని పాక్‌కు గట్టిగానే కౌంటర్ ఇస్తుంది.
మొదట ఏ దేశం అణు బాంబులు ప్రయోగిస్తుంది? అణు బాంబ్‌లు ప్రయోగిస్తే మొదటి గంటలో ఎంత మంది చనిపోతారు? మొదట వ్యూహాత్మక దాడులు చేసుకుంటారా? నగరాలపై దాడులకు పాల్పడతారా?
ప్రపంచంలోని రెండు అగ్రదేశాలు అమెరికా, రష్యా మధ్య అణు యుద్ధం జరిగితే పరిస్థితి ఏంటీ?
ముందుగా ఏ దేశం ఏ దేశంపై దాడి చేస్తుంది..? రెండు దేశాల్లోనే కాకుండా భూమిపై పరిణామాలు ఎలా ఉంటాయి? ఎంత మంది చనిపోతారు? ఎంత మంది గాయాల పాలవుతారు? ఎంత నష్టం జరుగుతుంది? ఇది తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు 'కంప్యూటర్ సిమ్యులేషన్ ' విధానాన్ని అనుసరించారు. ‘ప్రిన్సిటన్ యూనివర్శిటీ ఆఫ్ కాలేజెస్’కు చెందిన ‘ఇంజనీరింగ్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్’ నిపుణుడు అలెక్స్ గ్లాసర్ సిమ్యులేషన్ విధానంలో ప్రయోగం జరిపి వీడియోను కూడా విడుదల చేశాడు.
అలెక్స్ గ్లాసర్ సిమ్యులేషన్ ప్రకారం ..అమెరికా - రష్యా మధ్య అణు యుద్ధం మొదలైతే కొన్ని గంటల్లోనే 3 కోట్ల 41 లక్షల మంది మరణిస్తారు. 5 కోట్ల 59 లక్షల మంది గాయపడతారు. మొదటి మూడు గంటల్లోనే 26 లక్షల మంది మరణిస్తారు. అంతేకాదు..అదే సంఖ్యలో గాయాల పాలవుతారు. ఆ తరువాత 90 నిమిషాల్లో అమెరికా - రష్యా ఒకరిపై ఒకరు 5 నుంచి 10 అణ్వాయుధాలు ప్రయోగించుకుంటారు.
అణు యుద్ధ ప్రభావాన్ని ఊహించలేం. ఈ యుద్ధ ప్రభావం భూమండలంపై ప్రతి జీవిపై ఉంటుంది. అణ్వాయుధాన్ని డిజైన్ చేసిన దానిని బట్టి కూడా ప్రభావం ఉంటుంది. అణుబాంబ్ పేలినప్పుడు దానిలోంచి 35శాతం హీట్ బయటకు వస్తుంది. ఒక మెగాటన్ను అణుబాంబ్ పేలితే దాని తీవ్రత 13 నుంచి 50 మైళ్ల వరకు ఉంటుంది. పేలుడు ప్రభావం ఎలా ఉంటుందంటే మనుషులు మాడిమసై పోతారు.
ఇక..భారత్ - పాక్ విషయానికి వద్దాం. ఇక రెండు దేశాల మధ్య అణు యుద్థం వస్తే పరిస్థితి ఏంటీ?. భారత్ - పాక్‌ల మధ్య అణు యుద్ధం వస్తే ప్రపంచ పటంలో పాక్ అనే దేశం ఉండదేమో. ఇప్పటికే భారత పాలకులు ఈ మేరకు ప్రకటనలు కూడా చేశారు. పాక్ అణ్వాయుధాలతో దుస్సాహసం చేస్తే...పాక్‌ను లేకుండా చేయడానికి భారత్ దగ్గర ప్రణాళికలు ఉన్నాయి. కాని..భారత్ దగ్గర కంటే పాక్ దగ్గరే అణ్వాయుధాలు ఎక్కువుగా ఉన్నాయి.
యుద్ధాలతో వినాశనమే తప్ప అభివృద్ధి ఉండదు. సమస్యలను చర్చలు ద్వారా పరిష్కరించుకుంటూ ముందుకెళ్లినప్పుడే అభివృద్ధి. అణుబాంబ్‌లతో అభివృద్ధి కాదు..అంధకారం ఏర్పడుతుందనే విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తుంచుకోవాలి.