దేశంపై దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదు: లడఖ్‌లో రాజ్‌నాథ్‌సింగ్‌

By సుభాష్  Published on  17 July 2020 8:37 AM GMT
దేశంపై దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదు: లడఖ్‌లో రాజ్‌నాథ్‌సింగ్‌

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శుక్రవారం లడఖ్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో భాగంగా చైనా సరిహద్దులో ఉన్న లేహ్‌ ప్రాంతంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చీఫ్‌ డిపెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎ ఎం నరవాణెలతో పాటు భారత సైన్యంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ.. దేశ గౌరవంపై దాడిని ఏ మాత్రం ఉపేక్షించేది లేదని, భారత్‌ ఎప్పుడూ శాంతి కోరుకుంటుందని అన్నారు.

ప్రపంచానికి దేశం శాంతి సందేశాన్ని ఇచ్చిందన్నారు. దాడులకు పాల్పడితే ధీటుగా జవాబు చెప్పడానికి భారత్‌ సిద్ధంగా ఉంటుందని, భారత భూభాగాన్ని ఎవ్వరు కూడా ఒక్క అంగుళం కూడా తాకలేరని అన్నారు. సైనికులకు భారత ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. భారత్‌-చైనా ఘర్షణలలో భాగంగా భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం బాధగా ఉందన్నారు. ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చింది ఏకైక దేశం భారత్‌ అని, ప్రపంచం ఒక కుటుంబం అని భారత్‌ విశ్వసిస్తుందని అన్నారు. అలాగే అమరవీరులకు రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాళులు అర్పించారు. అలాగే సరిహద్దు సైనికులు వాడుతున్న అత్యాధునిక ఆయుధాలను పరిశీలించారు. రెండు రోజుల పాటు సాగే పర్యటనలో వాస్తవాధీన రేఖ ఎల్‌ఏసీతోపాటు ఎల్‌ఓసీ వద్ద వాస్తవ పరిస్థితులను రాజ్‌నాథ్‌ పరిశీలించనున్నారు.



Next Story