దేశంలో మళ్లీ లాక్‌డౌన్ ఉండదు
By తోట వంశీ కుమార్ Published on 18 Jun 2020 8:08 AM ISTదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ను విధిస్తారనే వదంతులు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని సీఎం కేసీఆర్ బుధవారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రధాని స్పందించారు. దేశంలో మళ్లీ లాక్‌డౌన్ ఉండదన్నారు. ప్రస్తుతం అన్‌లాక్ 1.0 నడుస్తోందన్నారు. అన్‌లాక్ 2.0 ఎలా అమలు చేయాలని అనే దానిపైనే చర్చించుకోవాలని తెలిపారు. కోవిడ్-19 వ్యాధి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్యను హైలైట్ చేయడం ద్వారా ప్రజల్లోని భయాందోళనను పారద్రోలాలని పేర్కొన్నారు.
సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని వివరించారు. తెలంగాణలో కరోనా ప్రస్తుతం అదుపులోనే ఉందని, మరణాల రేటు కూడా తక్కువగానే నమోదు అవుతుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా సాగిస్తున్న పోరు వల్ల కరోనా విషయంలో విజయం సాధిస్తామనే నమ్మకం తమకు ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, దాని చుట్టుప్రక్కల జిల్లాల్లో మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నాయన్నారు. వ్యాప్తి నివారణకు గట్టిగా కృషిచేస్తున్నామన్నారు. కొద్ది రోజుల్లోనే వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇంతకు ముందులా దేశంలో మళ్లీ మామూలు జీవితం ప్రారంభమవుతున్నందున ఎవరు ఎక్కడికైనా వెళ్లి పని చేసుకునే అవకాశం కల్పించాలని కేసీఆర్ కోరారు. వివిధ రాష్ట్రాల నుంచి కూలీలు, కార్మికులు, హమాలీలు మళ్లీ పని చేసుకోవడానికి వివిధ రాష్ట్రాలకు వెళ్లడానికి సిద్దమవుతున్నారని, వారికి వెసులుబాట్లు ఉండాలన్నారు. హార్ నుంచి వచ్చే హమాలీలను అక్కడి సీఎం నితీష్ కుమార్ వారిస్తున్నట్లు వచ్చిన వార్తలపై సీఎం కేసీఆర్ సరదాగా స్పందించారు. మీ కూలీలను బాగా చూసుకుంటాం. మా సీఎస్ కూడా మీ బిహార్ వారే. దయచేసి పంపండని చమత్కరించారు. దేశ రక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడవద్దని, దేశమంతా ఒక్కతాటపై నిలవాలని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో పాటు ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి స్పష్టం చేశారు.