కేసీఆర్‌ ఆ భయంతోనే 50వేల కరోనా టెస్టులు ప్రకటించారు: ఎంపీ బండి సంజయ్‌

By సుభాష్  Published on  17 Jun 2020 8:38 AM GMT
కేసీఆర్‌ ఆ భయంతోనే 50వేల కరోనా టెస్టులు ప్రకటించారు: ఎంపీ బండి సంజయ్‌

కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ సీఎం కేసీఆర్‌పై మరోసారి ఆరోపణలు గుప్పించారు. దేశంలో కరోనా వైరస్‌ తవ్రతరమవుతున్న నేపథ్యంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఎలాగైతే జోక్యం చేసుకుందో అలాగే తెలంగాణలో కూడా జోక్యం చేసుకునే అవకాశాలున్నాయనే భయంతో సీఎం కేసీఆర్‌ ఆగమేఘాల మీద 50వేల కరోనా పరీక్షలు చేస్తామని ప్రకటించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను ఆధీనంలో తీసుకుంటుందన్న భయం కేసీఆర్‌కు పట్టుకుందని వ్యాఖ్యనించారు.

కోవిడ్‌-19 నియంత్రణపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కేసీఆర్‌కు లేఖ రాస్తానని అన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించే సమయానికి ఇప్పటి వరకూ కేసుల సంఖ్య ఎలా ఉందో ప్రభుత్వమే ఆలోచించాలన్నారు.

కరోనా పరీక్షలు చేయడం వల్ల కేసుల సంఖ్య తగ్గుతుందని కేంద్రం ప్రభుత్వానికి పదేపదే చెబుతున్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. సీఎం 50వేల టెస్టులు చేస్తామని మాట తప్పారని ఆరోపించారు. అలాగే గచ్చిబౌలి 1500 పడకల ఆస్పత్రిని ఎందుకు ఉపయోగించడం లేదని బండి సంజయ్‌ ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు మాత్రమే గచ్చిబౌలి ఆస్పత్రిని చూపించారని ఆరోపించారు. ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తే కరోనా పరీక్షలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని సంజయ్‌ నిలదీశారు.

కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ముందు నుంచి డిమాండ్‌ చేస్తున్నామని అన్నారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల కోసం నిర్ణయించిన విధానం సరిగా లేదని, కరోనా నియంత్రణపై రాష్ట్ర గవర్నర్ సైతం అసహనంగా ఉన్నారన్నారు. చివరికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు కరోనా సోకిందనే సాకుతో 50 వేల కరోనా టెస్టులకు అనుమతి ఇచ్చారని అన్నారు. ఐసోలేషన్‌లో రూ.4వేలు, ఐసియులో రూ. 9వేలు చెల్లించే స్థోమత పేద ప్రజలకు ఉందా..? అని ప్రశ్నించారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ కింద ఎందుకు మార్చడం లేదని బండి సంజయ్‌ ప్రశ్నించారు. వీటన్నింటికి ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

Next Story