రైల్వే ప్రయాణికులకు ఆ సౌకర్యం శాశ్వతంగా బంద్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Sept 2020 3:38 PM IST
రైల్వే ప్రయాణికులకు ఆ సౌకర్యం శాశ్వతంగా బంద్

కరోనా దెబ్బకు యావత్ ప్రపంచం ప్రభావితమైంది. ఇక.. ఏదీ గతంలో మాదిరి ఉండదన్న మాట కరోనా పుణ్యమా అని వాస్తవ రూపంలోకి రానుంది. ప్రతి విషయంలోనూ కరోనా ప్రభావం పడనుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక అంశం రైల్వే ప్రయణికుల్లో ఆందోళనను పెంచుతోంది. ఇంతకాలం ఇచ్చిన ఒక వసతిని.. కరోనా దెబ్బతో శాశ్వితంగా తొలగించేందుకు రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నా.. అధికారికంగా ఆ అంశాన్ని బయటపెట్టటం లేదన్న మాట వినిపిస్తోంది.

కరోనా నేపథ్యంలో రైళ్లను పూర్తిస్థాయిలో నడిపే పరిస్థితులు లేకపోవటంతో పరిమితంగా మాత్రమే నడుపుతున్న సంగతి తెలిసిందే. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాత రైళ్లల్లోని ఏసీ కోచ్ లలో ఇప్పటివరకు సదుపాయం కల్పించిన దిండు.. దుప్పటి.. నాప్ కిన్ లాంటివేమీ ఇవ్వరని చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన కీలక భేటీలో రైల్వే అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

దీంతో.. ప్రయాణికులు ఎవరికి వారుగా వీటిని తెచ్చుకోవాలని చెబుతున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో కొత్తగా దుప్పట్లు.. తలదిండ్లు.. బెడ్ రోల్స్ ను కొనుగోలు చేయకూడదని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఆదేశాలుజారీ అయ్యాయని చెబుతున్నారు.

అంతేకాదు.. 20 రైల్వే డివిజన్లలో నిరుపయోగంగా ఉన్న దుప్పట్లు.. తలదిండ్లు.. బెడ్ రోల్స్ ను అమ్మేందుకు కాంట్రాక్టు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే జరిగితే.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురి కాక తప్పదు. దూర ప్రయాణాలు చేసే వారు.. ఏసీల్లో ప్రయాణించే వారికి బెడ్ రోల్స్.. తలదిండ్లు సౌకర్యంగా ఉండటమే కాదు.. అవసరం కూడా. ఆ సౌకర్యం బంద్ చేస్తే.. ప్రతి ప్రయాణికుడి లగేజ్ పెరగటమే కాదు.. పలు ఇబ్బందులు తప్పవని చెప్పక తప్పదు.

Next Story