మర్కజ్‌ మసీదు మూసివేత.. హై అలర్ట్‌

By అంజి  Published on  31 March 2020 7:23 AM GMT
మర్కజ్‌ మసీదు మూసివేత.. హై అలర్ట్‌

ఢిల్లీ: 'ఆలమీ మర్కజ్‌'.. ఇప్పుడు ఈ పేరే దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీలోని మర్కజ్‌ మసీదులో జరిగిన ఓ మత కార్యక్రమం దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడానికి కారణమైంది. దీంతో ఈ మసీదు పేరు మారుమోగిపోతోంది. ఈ కార్యక్రమంలో మన దేశం నుంచి మాత్రమే కాకుండా ఇండోనేషియా, కిర్గిజ్‌స్థాన్‌, మలేసియా, నేపాల్‌, సౌది అరేబియా, వంటి దేశాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో చాలా మందికి కరోనా సోకింది. దీంతో దేశ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ప్రస్తుతం మన దేశంలో కరోనా వైరస్‌ రెండో దశలో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమానికి హాజరైన సుమారు 400 మందిని అదుపులోకి తీసుకునేందుకు అధికారులు అప్రమత్తమయ్యారు. వారి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే 163 మంది నిజాముద్దీన్‌ వాసులను ఆస్పత్రికి తరలించారు. మసీదును అధికారులు మూసివేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఆదేశాల మేరకు మసీదుకు సీల్‌ వేశారు. మర్కజ్‌ మసీదులో ప్రార్థనలు నిర్వహించినవారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. మర్కజ్‌ ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్‌ కెమెరాలతో అక్కడి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ప్రార్థనల్లో పాల్గొన్న 1200 మందిని అధికారులు క్వారంటైన్‌ సెంటర్లకు తరలించారు. వీరిలో ఇప్పటికే 24 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. మిగతవారికి కూడా వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. వీరిలో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదు అయ్యే ఛాన్స్‌ ఉందని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన ప్రార్థనలకు వెళ్లిన వారి కోసం అధికారులు జల్లెడ పడుతున్నారు. ప్రార్థనల్లో పాల్గొన్న వారు విధిగా తమ సమచారాన్ని తెలియజేయాలని అధికారులు కోరుతున్నారు.

దేశంలో తాజాగా వెలుగుచూస్తున్న కరోనా పాజిటివ్‌ కేసులకు మూలాలు ఢిల్లీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రార్థనలకు వెల్లి వచ్చిన వారిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. తెలంగాణలో నిన్న ఒక్క రోజే కరోనాతో ఆరుగురు మృతి చెందారు. వీరంతా కూడా ఢిల్లీలోని మర్కజ్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన వారే. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నమోదైన అన్నీ కేసులకు ఢిల్లీ లింకులే ఉన్నట్లు తెలిసింది. ఢిల్లీ వెళ్లిన, వెళ్లి వచ్చిన వారి బంధువులకు కరోనా పాజిటివ్‌ అని తేలింది.



Next Story