ప్రసంగం మధ్యలోనే ముగించిన నిర్మలా సీతారామన్‌..ఎందుకంటే

పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా ఈ రోజు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత ప్రసంగించిన నిర్మలా సీతారామన్‌.. తన ప్రసంగం మధ్యలోనే ముగించారు. అప్పటికే రెండు గంటల 40 నిమిషాల పాటు ప్రసంగం కొనసాగడంతో ఆమె కొంత అలసటకు లోనయ్యారు. ప్రసంగిస్తున్నంత సేపు ఆమె సరిగ్గా నిల్చోలేకపోయారు. ఆమెకు మధుమోహ సమస్య, బీపీ ఉండటం వల్ల ఎక్కువ సేపు ప్రసంగిస్తూ ఉండలేకపోయారు. ఆమెకు బీపీ తగ్గిపోవడంతో కాస్త అస్వస్థకు గురై కొంత సేపు కూర్చుండిపోయారు. ఆ సమయంలో నిర్మలా సీతారామన్‌కు షుగర్‌ అందించారు.

దీంతో కొంత సేపు తర్వాత మళ్లీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కాగా, అప్పటికే ఆమె చదవాల్సిన ప్రతుల్లో రెండు పేజీలు మిగిలిపోయాయి. ఓపిక లేకపోయినా చదివేందుకు ప్రయత్నించారు. పేజీ తిప్పుతుండగా ఆమె అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆమె వైపు చూసి ఇక ప్రసంగాన్ని ముగించండి అంటూ సైగ చేయడంతో ఆమె ప్రసంగాన్ని ముగించారు.

మొత్తం ఆమె ప్రసంగం 2 గంటల 40 నిమిషాల పాటు కొనసాగింది. 2019లో ఆమె 2 గంటల 17 నిమిషాల పాటు బడ్జెట్‌ను చదివి వినిపించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది మరో 23 నిమిషాలు ఎక్కువే సేపు ప్రసంగించారు. ఇప్పటి వరకు సాగిన బడ్జెట్‌ ప్రసంగాల్లో సుదీర్ఘ సమయం తీసుకున్న ఆర్థిక శాఖ మంత్రి కావడం విశేషం.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.