బడ్జెట్ 2020 ముఖ్యాంశాలు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్ సభలో 2020 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలుగు ప్రజలకు నిరాశే మిగిలింది. మన తెలుగింటి కోడలు..మన రాష్ర్టాల కోసం కూడా మేలైన బడ్జెట్ ను ఇస్తుందనుకుంటే...అనుకున్న దానికంతా విరుద్ధంగా జరిగింది.
ఇప్పటివరకూ 40 కోట్ల జీఎస్టీ రిటర్న్లు దాఖలైనట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ ప్రవేశ పెట్టిన తరువాత పన్ను విధానంలో పారదర్శకత వచ్చిందని, జీఎస్టీ స్లాబ్ ల తగ్గింపుతో సామాన్యులకు ఎంతో మేలు చేకూరుతుందని ఆమె పేర్కొన్నారు. జీఎస్టీ మండలి జీఎస్టీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్...మా లక్ష్యమన్నారు నిర్మల. ఖర్చు చేసే ప్రతి రూపాయి నిరుపేదలకు అందించేందుకే కేంద్రం కృషి చేస్తుందన్నారు. అలాగే నిర్మాణాత్మక చర్యలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. 2006 నుంచి 2016 మధ్య పేదరికం నుంచి 22 కోట్ల మంది బయటపడ్డారని తెలిపారు. అదేవిధంగా 2019లో కేంద్రంపై 48.7 శాతం మేరకు రుణభారం తగ్గిందన్నారు.
ప్రధాని ఆవాస్ యోజన ద్వారా దేశంలోని పేదలందరికీ సొంత ఇళ్లు ఇచ్చామన్నారు. బడ్జెట్ లో తొలి ప్రాధాన్యత వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధికి, రెండో ప్రాధాన్యత ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీటికి ఇచ్చారు. మూడో ప్రాధాన్యాంశంగా విద్య, చిన్నారుల సంక్షేమాన్ని బడ్జెట్ లో చేర్చారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యమని, ఈ మేరకు త్వరలోనే కౌలు రైతుల కోసం కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రధాని ఫసల్ బీమా ద్వారా 6.11 కోట్ల మంది రైతులకు బీమా కల్పించామన్నారు.
2030 నాటికి అత్యధిక యువతకు భారత్ లోనే ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. స్థానిక సంస్థల్లోనే ఇంజనీరింగ్ విద్యార్థుల అప్రెంటీస్ విధానాన్ని అమలు చేసి నిరుద్యోగ కొరత తగ్గిస్తామన్నారు. విదేశీ విద్యార్థుల కోసం స్టడీ ఇన్ ఇండియా పేరిట కొత్త కార్యక్రమం చేపట్టనున్నట్లు నిర్మలమ్మ పేర్కొన్నారు. నూతనంగా నేషనల్ పోలీస్ వర్శిటీ, నేషనల్ ఫోరెన్సిక్ వర్శిటీ లను ఏర్పాటు చేయనుంది కేంద్రం. 2026 నాటికి 150 యూనివర్శిటీల్లో కొత్త కోర్సులు ప్రవేశపెడతామన్నారు. జిల్లా ఆసుపత్రులతో మెడికల్ కాలేజీలను అనుసంధానం చేస్తామన్నారు.