‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌ పై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. దిశను అత్యాచారం, హత్య జరిగిన నాటి నుంచి నిందితులను ఉరి తీయాలంటూ పెద్ద ఎత్తున నిరసననలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఒక దశలో పోలీసులపై కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడే రోజులొస్తున్నాయని, నిందితులను వెంటనే ఉరి తీయాలంటే పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నిన్న చర్లపల్లిజైలు నుంచి నిందితులను కస్టడీకి తీసుకున్న పోలీసులు, విచారణ నిమిత్తం ఘటన స్థలానికి తీసుకువచ్చి  సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా, నిందితులు పరారయ్యేందుకు ప్రయత్నించి, పోలీసులు రాళ్లు రువ్వారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపి నలుగురిని చంపేశారు.

తాజా ఘటనను దృష్టిలో ఉంచుకుని 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ  కేసును లేవనెత్తుతున్నారు ప్రజలు. ఇక దిశ ఘటనకు న్యాయం జరిగింది… మరి ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు నిందితుల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. ఇన్నేళ్లవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి శిక్ష ఎందుకు విధించడం లేదని ప్రశ్నిస్తున్నారు. దిశకు న్యాయం జరిగినా…., కానీ నిర్భయ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దిశ చనిపోయిన ఎనిమిది రోజుల్లోనే నిందితులను కాల్చివేసినట్లే, ఇలాంటి కేసుల్లో ఉన్న నిందితులకు ఇలాంటి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలంటున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్‌ లో నిర్భయపై  ఆరుగురు వ్యక్తులు అత్యాచారం జరిపిన సంగతి తెలిసిందే. అనంతరం చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు నిందితులకు ఉరిశిక్ష విధించింది. నిందితుల్లో ఒకరైన రామ్‌సింగ్‌ జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడగా, ఒక నిందితున్ని మైనర్‌ అని శిక్ష విధించలేదు. ఈఘటన జరిగి ఏడేళ్లు అవుతున్నా… వారిని జైల్లోనే ఉంచి నిర్లక్ష్యం చేయడం ఏంటని జనాలు మండిపడుతున్నారు. అత్యాచారాలు, హత్యలు చేసిన వారికి ఇతర దేశాల్లో కఠిన శిక్షలు అమలవుతున్నాయని, మన దేశంలో మాత్రం ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా నిందితులకు ఎలాంటి శిక్షలు పడటం లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. నిర్భయ నిందితులకు ఉరిశిక్ష విధించినా.. ఇప్పటి వరకు ఉరి వేయలేదని, ఇందులకు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.