భారీ ఉగ్రకుట్ర భగ్నం.. 9 మంది అల్‌ఖైధా ఉగ్రవాదుల అరెస్ట్
By తోట వంశీ కుమార్ Published on 19 Sept 2020 9:59 AM ISTఅల్‌ఖైధా పన్నుతున్న భారీ కుట్రను ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) భగ్నం చేసింది. విశ్వసనీయ సమాచారంతో కేరళ, పశ్చిమ బెంగాల్‌లోని అనుమానితుల పై దాడులు జరిపింది. కేరళలోని 11 ప్రాంతాల్లో, బెంగాల్‌లో నిర్వహించిన దాడుల్లో 9 మందిని అదుపులోకి తీసుకుంది. ఎర్నాకులం, ముర్షీదాబాద్ ప్రాంతాల్లో ఎన్‌ఐఏ ఈ దాడులు నిర్వహించింది.
ఈ 9 మంది యువకులు అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నట్లు గుర్తించింది ఎన్‌ఐఏ. పశ్చిమ బెంగాల్‌లోని ముర్సీదాబాద్‌తో పాటు కేరళలోని ఎర్నాకుళంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో కేరళలోని ఎర్నాకుళం, పశ్చిమబెంగాల్‌లోని ముషీరాబాద్‌లో దాడులు నిర్వహించినట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది.' ఆల్‌ఖైదాకు చెందిన అంతరాష్ట్ర ఉగ్రముఠా పశ్చిమబెంగాల్, కేరళలోని వివిధ ప్రాంతాల్లో సామాన్య ప్రజలే లక్ష్యంగా పేలుళ్లకు పాల్పడే పన్నాగం పన్నుతున్నట్లు తెలిసింది. దీంతో దాడులు నిర్వహించి వారందరినీ అరెస్ట్ చేసినట్లు' ఎన్‌ఐఏకు చెందిన ఓ సీనియర్ అధికారి మీడియాకు వెల్లడించారు. వీరి నుంచి డిజిటల్ పరికరాలు, జిహాదీ సాహిత్యం, పదునైన ఆయుధాలు, పేలుడు పదార్థాలను తయారు చేయడానికి వినియోగించే లిటరేచర్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని ఢిల్లీకి తరలించి కోర్టులో హాజరు పరచనున్నారు.