ఆ పది రాష్ట్రాల్లో భారీగా క్రాస్ ఓటింగ్..
Cross-voting in 10 states bolsters Droupadi Murmu’s win. రాష్ట్రపతి పీఠాన్ని బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ అభ్యర్థి ద్రౌపది ముర్ము కైవసం
By Medi Samrat Published on 22 July 2022 3:35 PM ISTరాష్ట్రపతి పీఠాన్ని బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ అభ్యర్థి ద్రౌపది ముర్ము కైవసం చేసుకుంటారని మొదటి నుంచీ స్పష్టంగా తెలిసిన విషయమే. ద్రౌపది ముర్ముకు అధికార పార్టీ, దాని మిత్రపక్షాల మద్దతు మాత్రమే కాకుండా, ఎన్డీయేతర పార్టీల మద్దతు కూడా భారీగానే ఉంది. ప్రతిపక్ష పార్టీలు యశ్వంత్ సిన్హాకు మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ.. వాటి మిత్రపక్షాలు, అండగా ఉంటామని ప్రకటించిన పార్టీలు కూడా ముర్ముకు మద్దతుగా నిలిచారు. దీంతో నిజమైన ప్రతిపక్ష ఐక్యత అనేది కలగానే మిగిలిపోయింది.
పోలైన ఓట్లలో ద్రౌపది ముర్ము 64 శాతం సాధించి యశ్వంత్ సిన్హాపై ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించారు. ఈ విషయాన్ని గమనిస్తే.. ముర్ముకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేయడానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ అధినాయకత్వాల మాటను ధిక్కరించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ముర్ముకు అనుకూలంగా 126 మంది ఎన్డీయేతర ఎమ్మెల్యేలు, 17 మంది ఎన్డీయేతర ఎంపీల ఓట్లు వచ్చాయి.
అస్సాం, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎక్కువ సంఖ్యలో బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అభ్యర్థి అయిన ద్రౌపది ముర్ముకు ఓటు వేశారు. అస్సాంలో 22 మంది ఎమ్మెల్యేలు, మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 20 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. బీహార్, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి ఆరుగురు చొప్పున, గోవా నుంచి నలుగురు, గుజరాత్ నుంచి 10 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ముర్ముకు ఓటు వేసి ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
ద్రౌపది ముర్మును విజేతగా ప్రకటించిన వెంటనే.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ "తమ మనస్సాక్షి ప్రకారం" ఓటు వేసిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలుపుతూ సందేశాలను కూడా పంపారు. ద్రౌపది ముర్ము గిరిజన నేపథ్యం వల్ల జార్ఖండ్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుండి కూడా మద్దతు లభించింది. అక్కడ అధికార జేఎంఎం ఇప్పటికే ముర్ముకు మద్దతు ప్రకటించింది.
గత నెలలో ఉద్ధవ్ థాకరే-ఎన్‌సిపి-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏక్నాథ్ షిండే-బిజెపి కూటమి కూల్చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన 16 మంది ఎన్‌డిఎయేతర శాసనసభ్యులు ముర్ముకు ఓట్లు వేశారు.
గోవాలో అధికార బీజేపీ, దాని మిత్రపక్షాలకు 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా, ముర్ముకు 28 ఓట్లు వచ్చాయి. దీంతో ప్రతిపక్షానికి చెందిన ముగ్గురు రాష్ట్ర శాసనసభ్యులు ముర్ముకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ వేశారని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు.
రాష్ట్ర అసెంబ్లీలో ఒక్క బిజెపి శాసనసభ్యుడు కూడా లేని కేరళ నుండి ఎన్‌డిఎ అభ్యర్థికి అనూహ్య ఓటు లభించింది. సిపిఐ (ఎం) నేతృత్వంలోని అధికార ఎల్‌డిఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ ప్రతిపక్ష ఫ్రంట్ సిన్హాకు తమ మద్దతును ప్రకటించాయి. మేఘాలయలో ఏడుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయగా, పంజాబ్‌లో ఆ కౌంట్ రెండుగా ఉంది.
రాష్ట్రపతి ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. తన సొంత పార్టీలోనే తిరుగుబాటును ఎదుర్కున్నట్లు తెలుస్తోంది. నలుగురు టీఎంసీ ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు ముర్ముకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారని బీజేపీ పేర్కొంది.
గుజరాత్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మనీష్ దోషి మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు తెలిసింది. అంతర్గత విచారణ ప్రారంభించాం.. తప్పు చేసిన ఎమ్మెల్యేలపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.