కేఏ పాల్ ప్రశ్నిస్తున్న రేంజ్‌లో.. వైసీపీ నేతలు ఎందుకు ప్ర‌భుత్వాన్ని నిల‌దీయ‌డం లేదు.?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందడి ముగిసింది. కూటమి ఘన విజయం సాధించింది. ఇక ఎవరికి వారు బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నారు.

By Medi Samrat  Published on  2 July 2024 9:15 PM IST
కేఏ పాల్ ప్రశ్నిస్తున్న రేంజ్‌లో.. వైసీపీ నేతలు ఎందుకు ప్ర‌భుత్వాన్ని నిల‌దీయ‌డం లేదు.?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందడి ముగిసింది. కూటమి ఘన విజయం సాధించింది. ఇక ఎవరికి వారు బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నారు. అయితే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మాత్రం ఒక రేంజిలో కూటమి నేతల మీద ఫైర్ అవుతూ ఉన్నారు. ఎన్నికల ఫలితాల సమయంలో ఈవీఎంల ద్వారా మోసాలకు పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేశారు పాల్. అదే మాట మీద ఆయన కట్టుబడి ఉన్నారు. ఇక స్టీల్ ప్లాంట్ విషయంలోనూ, పవన్ కళ్యాణ్ ఒకప్పుడు చేసిన వ్యాఖ్యల విషయంలోనూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు కేఏ పాల్.

కొద్దిరోజుల కిందటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తన వాయిస్ ను వినిపించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు అంటూ, రాజమండ్రీ ఎం.పీ. పురంధేశ్వరి, సుజనా చౌదరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ వినతి పత్రం ఇవ్వడం పెద్ద డ్రామా అంటూ విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి అంటూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి వినతి పత్రం అందజేయడం హాస్యాస్పదన్నారు. కేంద్రంలోని బీజేపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుండగా, ఆ పార్టీ ఎంపీలు ప్రధాని బదులుగా ఉక్కు శాఖ మంత్రినీ కలవడం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం అదానీ, అంబానీ, జిందాల్, మిట్టల్‌కు దేశ సంపదను దోచిపెడుతోందని.. 8 లక్షల కోట్ల రూపాయల విలువైన వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను కూడా చౌకగా విక్రయించాలని చూడటం అన్యాయమన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ఆస్తులు అమ్మకూడదంటూ 2024 ఏప్రిల్‌ 25వ తేదీన హైకోర్టు స్టే ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని, పవన్‌ కళ్యాణ్‌ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని, భరత్‌ విశాఖపట్నం ఎంపీగా ఉన్నారని.. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం టీడీపీపై ఆధారపడి కొనసాగుతున్న పరిస్థితుల్లో ఎన్నికల్లో స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో ఇచ్చిన హామీల అమలుకు ఏం చేశారని నిలదీశారు.

ఏపీ ఎన్నికల ప్రచార సమయంలో వాలంటీర్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని.. చాలా మంది కనిపించకుండా పోయారని కూడా అన్నారు. దీనిపై కూడా కేఏ పాల్ ఊహించని రీతిలో ఫైర్ అయ్యారు. ఇప్పుడు వ్యవస్థలు పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉన్నాయని ఎందుకు వీటిపై విచారణ చేయడం లేదో అని ప్రశ్నించారు. ఆంధ్రాలో 30 వేలకు పైగా మహిళలు, యువతలు మిస్సింగ్ అయ్యారని.. ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిందని పవన్ కళ్యాణ్ ఆనాడు అన్నారు. ఇదంతా కేంద్రం నుంచి తనకు నిఘా సంస్థలు తెలియజేశారని చాలా విశ్వసనీయ సమాచారం వచ్చిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. దీనిపై హోం మంత్రితో కలిసి పవన్ కళ్యాణ్ విచారణ చేయించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఇలా కేఏ పాల్ కూటమి నేతలపై రెచ్చిపోతున్న తీరు చూస్తుంటే.. ఈ మాత్రం ఫైర్ వైసీపీ నేతల్లో లేకుండా పోయిందా అనే డౌట్స్ నెటిజన్లకు వస్తున్నాయి.

Next Story