పుట్టిన పిల్లలకు ఒకరికి 'లాక్‌డౌన్' పేరు.. మరొకరికి 'కరోనా' పేరు
By సుభాష్ Published on 2 April 2020 5:04 PM ISTజనాలు ట్రెండ్‌ను ఫాలో కావడంలో ఎప్పుడూ ముందుంటారు. కానీ ఇంత విచిత్రమైన ట్రెండ్‌ను ఫాలో అవుతారనేది ఆశ్చర్యకరమే. ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లో కరోనా వైరస్ వణికిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పిలుపుతో అన్ని రాష్ట్రాల్లోనూ 'లాక్‌డౌన్' అమలవుతోంది. దీంతో ప్రజలంతా బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం అయ్యారు.
కాగా, కరోనా పేరును జనాలు రకరకాలుగా వాడేస్తున్నారు. పాటల రూపంలో కరోనా పేరును వాడేస్తుంటే.. మరి కొందరు టిక్‌టాక్ రూపంలో వాడేస్తున్నారు. తాజాగా పుట్టిన పిల్లలకు పేర్ల రూపంలో కూడా వాడేస్తుండటంతో ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని డోరియా జిల్లాలో ఖుఖుంద్ గ్రామంలో పుట్టిన మగ శిశువుకు తల్లిదండ్రులు 'లాక్‌డౌన్' అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా ఆ శిశువు తండ్రి పవన్ మాట్లాడుతూ.. 'కరోనా' సందర్భంగా విధించిన లాక్‌డౌన్ సమయంలో నా బిడ్డ పుట్టాడు. లాక్‌డౌన్ ద్వారా ప్రధాని నరేంద్రమోదీ కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నారు. ప్రజల బాగోగుల కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ నా బిడ్డకు 'లాక్ డౌన్' అని పేరు పెట్టాను' అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు ఎలాంటి వేడుకలు నిర్వహించనని తెలిపాడు.
ఇదిలాఉంటే.. ఇటీవల ఇదే రాష్ట్రంలోని గోరక్‌పూర్ జిల్లా, సాహ్గోరా గ్రామంలో పుట్టిన ఓ ఆడ బిడ్డకు 'కరోనా' అని పేరు పెట్టారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ పేరు పెట్టినట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు. వింత పోకడ అంటే ఇదేనేమో... ఇలా పిల్లల పేర్లు కూడా లాక్‌డౌన్, కరోనా అని పెట్టడం ఆశ్చర్యపోతున్నారు ప్రజలు.