బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా జగత్‌ ప్రకాశ్‌ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నడ్డాకు అధ్యక్ష పగ్గాలు అప్పగించారు. కాగా, జేపీ నడ్డా పార్టీ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు బీజేపీ సంస్థాగత ఎన్నికల ఇన్‌చార్జి రాధామోహన్‌సింగ్‌ నియామక పత్రాన్ని అందజేశారు. సోమవారం సాయంత్రం బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రలతో నూతన అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది మే నెలలో జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో జేపీ నడ్డా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ప్రస్తుతం నడ్డా బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నవిషయం తెలిసిందే.

‘ఒక వ్యక్తికి ఒకే పదవి’

గతంలో బీజేపీ అధ్యక్షుడిగా అమిత్‌షా ఐదున్నరేళ్లుగా పని చేసి పార్టీని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. అమిత్‌ షా హయాంలో బీజేపీ కేంద్రంలో రెండు సార్లు, పలు రాష్ట్రాల్లోనూ అధికార పగ్గాలు చేపట్టింది. తాజాగా ప్రధాని మోదీ సర్కార్‌లో అమిత్‌ షాకు హోంశాఖ మంత్రి పదవి దక్కింది. దీంతో ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అనే సంప్రదాయం ప్రకారం పార్టీ అధ్యక్ష పదవి కోసం మరొకరిని ఎన్నుకోవడం జరిగింది. ఇక ఎన్నో ఏళ్లుగా జేపీ నడ్డా పార్టీకి సేవలందిస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.