ప్రముఖ ఓటీటీ దిగ్గ‌జం‌ నెట్‌ఫ్లిక్స్‌ భారత్‌లో రెండు రోజుల పాటు ఫ్రీ ట్రయల్‌ను అందించేందుకు సిద్ధమైంది. డిసెంబర్ నాలుగో తేదీ నుంచి ఇది అందుబాటులోకి రానుంది. దీనికి స్ట్రీమ్ ఫెస్ట్ అని పేరు కూడా పెట్టింది. మొదటగా ఈ ఆఫర్ కేవలం మనదేశంలో మాత్రమే అందుబాటులోకి రానుంది.

ఆ తర్వాత కొత్త ప్లాన్‌ను ఇతర దేశాల్లో తీసుకొచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్‌ ప్రణాళికలు రచిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ ఇప్పటికే 30 రోజుల ఉచిత ట్రయల్స్‌ను అందిస్తున్నది. అయితే తర్వాత కొన్ని దేశాల్లో దాన్ని క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు మళ్లీ ఈ రెండు రోజుల ఫ్రీ-ట్రయల్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

మనదేశంలో ఈ ఆఫర్‌కు రెస్పాన్స్ బాగుంటే మిగతా దేశాల్లో కూడా ఈ ఆఫర్‌ను నెట్ ఫ్లిక్స్ అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. గతంలో ఒక నెల ఉచిత ట్రయల్ కోసం క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు అందించాల్సి వచ్చేది. అయితే ఈ రెండు రోజుల ప్రమోషనల్ ఆఫర్‌కు మాత్రం ఆ అవసరం లేదు.

కొత్త వినియోగదారులు ప్లాట్‌ఫామ్‌లోని కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లను చూడటానికి ఈ ఆఫర్‌ ప్రవేశపెట్టింది. ఈనెల ఆరంభంలో అమెరికాలో 30రోజుల ఉచిత సేవలను నెట్‌ఫ్లిక్స్‌ నిలిపివేసింది. భారత్‌తో పాటు పలు దేశాల్లో ఈ సర్వీసు అమల్లోనే ఉంది. కొత్త వినియోగదారులను ఆకట్టుకునే ఉద్దేశంతో రెండు రోజుల ప్రమోషనల్ ఆఫర్‌ తీసుకొచ్చినట్లు నెట్‌ఫ్లిక్స్‌ చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ గ్రెగ్‌ పీటర్స్‌ తెలిపారు. ప్రమోషన్‌ ఆఫర్‌లో భాగంగా యూజర్లు 48 గంటల పాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ను వాడుకొనే వీలుంది.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story