నెట్‌ఫ్లిక్స్ జోరు.. కొత్త సినిమాల హోరు..!
By మధుసూదనరావు రామదుర్గం Published on 17 July 2020 5:58 PM ISTఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తన ప్రేక్షకుల కోసం కొత్త సినిమాలను వరసకట్టి అందించేందుకు సిద్ధమవుతోంది. నేరుగా ఓటీటీలో విడుదల కానున్న సినిమాల వివరాలను ప్రకటించేసింది. కరోనా వేళ థియేటర్లు బంద్ పెట్టడంతో ఇక కొత్త సినిమాలు చూడలేమని దిగులు చెందే సినిమాభిమానులకు ఇక పండగే పండగ. హేమాహేమీల సినిమాలు నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల్ని అలరించబోతున్నాయి. అభిషేక్ బచ్చన్ నటించిన లోడో, సంజయ్ దత్ తోర్బాజ్, దర్శకుడు మీరా నాయర్ నిర్మించిన ఎ సూటబుల్ బాయ్ లాంటి పెద్ద చిత్రాలు రానున్న కొన్ని నెలల్లో నెట్ ఫ్లిక్స్ లో రావడం అంటే డిజిటల్ ప్లాట్‌ఫాం బాగా పుంజుకుంటున్నట్టే లెక్క!
నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 17 వినోద భరితాలు తమ ప్లాట్ ఫాంపై విడుదలై ప్రేక్షకులకు కనువిందు కలిగించనున్నట్లు ప్రకటించింది. వీటిలో ఎనిమిది సినిమాలు కాగా మిగిలినవి వెబ్ సీరీస్‌లు. విభిన్న కథాంశాలతో.. కిర్రెక్కించే కథనాలతో.. ప్రాంతీయ గుబాళింపులతో పోటీని విపరీతంగా పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, డిస్నీ-హాట్ స్టార్ ఈ తరహా కంటెంట్ ను తమ ప్రేక్షకులకు అందించడానికి అన్ని రకాల వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. వీటికి పోటీగా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ సై అంటే సై అంటోంది.
ఈ సమరోత్సాహానికి కరోనా గానీ లాక్‌డౌన్ గానీ ఏమాత్రం అడ్డు కాకపోవడం విశేషం. ఇంటికే పరిమితమవుతున్న ప్రజలకు కావలసినంత వినోదం పంచుతూ తమ ఓటీటీ నుంచి కళ్లు తిప్పు కోలేని పరిస్థితి కల్పిస్తున్నాయి.
మేము ప్రకటించిన జాబితాలో విభిన్న కథాంశాలతో ఉక్కరి బిక్కరి చేయడంతోపాటు ఉత్కంఠ, ఉత్సాహ భరితమైన సినిమాలు, సీరీస్ లు ఉన్నాయి. హృదయం ద్రవించే సన్నివేశాలు, సస్పెన్స్ థ్రిల్లర్లు గా సగటు ప్రేక్షకులను కట్టిపడేయగల సత్తా ఉన్న వినోదాంశాలు చాలానే ఉన్నాయి. సుప్రసిద్ధ దర్శకులు, సృజనాత్మకతను తమ ఆత్మగా భావించిన వారు, ప్రతిభా పాటవాలు గలిగిన కొత్త వాళ్లు...పేరు గడించిన వారు.. కొత్తగా కాలుమోపే వారు టాలెంట్ తమ సొంతమని నమ్మిన వార తీసిన చిత్రాలు,సీరీస్ ప్రజల్ని అలరించబోతున్నాయి. అచ్చమైన భారతీయతను సొంతం చేసుకున్న సీరీస్ లను నెట్‌ఫ్లిక్స్ లో తెస్తున్నాం. మా ప్రేక్షక దేవుళ్లు కొత్తదనం, అలాగే సనాతనం రెండు ఆస్వాదించగల సహృదయలు. కేవలం వారి అభిరుచిని దృష్టిలో పెట్టుకునే ఈ 17 వినోద భరిత అంశాలను తెస్తున్నామని నెట్ ఫ్లిక్స్ ఇండియా- కంటెంట్-వీపీ మౌనికా సెర్గిల్ తెలిపారు.
పూర్తి స్థాయి వినోదాన్ని అందించే క్రమంలో భాగంగా మా ప్రేక్షకులకు ఉద్వేగ ఉత్తేజ ఉత్కంఠ భరిత వినోదాన్ని అందించాలనుకుంటున్నాం. నెట్‌ఫ్లిక్స్ ప్రత్యేకతను తెలుసుకున్న ప్రతి అభిమాని అభిరుచిని అనుసరించి వారిని గరిష్ఠ స్థాయిలో సంతృప్తి పరచాలన్నదే మా అభిలాష అని మౌనిక అన్నారు. గ్లోబల్ టైటిల్స్, వరల్డ్ సినిమా, హిందీ సినిమా, ప్రాంతీయ సినిమా వారు ఏది కోరుకుంటే అది ఎలా కోరుకుంటే అలా నెట్ ఫ్లిక్స్ ప్లాట్ ఫాంలో అర్దరాత్రి వెదికినా కచ్చితంగా లభించేలా జాగ్రత్త పడుతున్నామని ఆమె వివరించారు.
గుంజన్ సక్సేనా నిర్మించిన బయోపిక్ ది కార్గిల్ గర్ల్ (జాహ్నవీ కపూర్), మనూ జోసెఫ్ వ్యంగ్యాత్మక చిత్రం సీరియస్ మెన్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ)లను ఇప్పటికే ప్రకటించింది.. ఇంకా ప్రేక్షకుల కళాతృష్ణను తీర్చేలా పలు సినిమాలు, సీరీస్ త్వరలో ప్లాట్ ఫాంను చేరుకోనున్నాయి. ఇతర ఓటీటీలు చూస్తూ పెదవి విరిచే పరిస్థితి ప్రేక్షకులకు తీసుకురాకూడదనే ఈ ఓటీటీ నిర్వాహకుల తపన తాపత్రయం.
గాఢమైన కథాంశం వినోదాన్ని మేళవించిన భారీ చిత్రం లోడో విడుదల కానుంది. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, రాజ్ కుమార్ రావు, ఆదిత్యారాయ్ కపూర్, సాన్యా మల్హోత్ర, ఫాతిమా సనా షాయిక్, పంకజ్ త్రిపాఠి లాంటి హేమాహేమీ తారగణం కనిపించనుంది.
సంజయ్ దత్ నటించిన యాక్షన్ థ్రిల్లర్, గిరీష్ మాలిక్ దర్శకత్వం వహించిన తోర్బాజ్, రాధికా అప్టే, నవాజుద్దీన్ నటించిన, హనీ ట్రిహాన్ దర్శకత్వం వహించిన క్రైం థ్రిల్లర్ రాత్ అకేలీ హై, అలంకృత శ్రీవాస్తవ నటించి కామెడీ చిత్రం డోలీ కిట్టీ ఔర్ ఓ చమక్తే సితారే, కుటుంబ వినోదాత్మక చిత్రం త్రిభంగ, కాజోల్, తన్వి అజ్మీ, మిథిలా పాల్కర్ లు నటించిన తేది మేది క్రేజీ, గీతాంజలీరావ్ యూనిమేటెడ్ చిత్రం బోంబే రోజ్ తదితర కొత్త చిత్రాలు త్వరలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానున్నాయి.
అలాగే షోలకు సంబంధించి విక్రమ్ సేథ్ రచించిన ప్రసిద్ధ బెస్ట్ సెల్లర్ నవల ఏ సూటబుల్ బాయ్ ఆధారంగా మీరా నాయర్ రూపొందించిన సీరీస్ ప్రేక్షకులకు కనువిందు చేయబోతోంది. ఈ సీరీస్ లో ఇషాన్ కటర్ ప్రధాన పాత్రపోషిస్తున్నాడు. ఇలాంటి ఎన్నో హంగులతో నెట్ ఫ్లిక్స్ ప్రేక్షకులకు కనువిందు కలిగించడమే కాదు ఇతర ఓటీటీ ప్లాట్ ఫాంలకు సవాల్ విసరనుంది. సినిమాలు థియేటర్లలో చూడలేకపోతున్నామనే సగటు ప్రజల బాధను ఈ హంగామా తుడిచేస్తుంది. సో.. కరోనా కష్టాల్లో ఇదో చిన్నపాటి సుఖమని తృప్తిపడదాం.. ఏమంటారు?