నాయిని అంత్యక్రియలు పూర్తి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Oct 2020 12:56 PM GMT
నాయిని అంత్యక్రియలు పూర్తి

టీఆర్ఎస్ నేత‌, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి నేడు తుదిశ్వాస విడిచారు. ఆయ‌న అంత్యక్రియలను‌ ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ఆయనను చివరసారిగా చూసేందుకు రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు హాజరై నివాళులర్పించారు.

నాయిని అంత్యక్రియలకు హాజ‌రైన‌ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌లు పాడె మోశారు. అంత్య‌క్రియ‌లకు హాజ‌రైన వారు నాయినితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. నాయినికి కార్మిక నాయకుడిగా ప్ర‌జ‌ల్లో మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్రం కోసం జ‌రిగిన‌ ఉద్యమంలో ఆయన విరోచితంగా పోరాడారు.

టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుండి కేసీఆర్‌తో ఉన్న నాయిని రాష్ట్రం ఏర్ప‌డ్డాక‌ తెలంగాణ తొలి హోంమంత్రిగా పనిచేశారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగిన ఆయ‌న‌.. 1978లో జనతాపార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అటు కార్మిక రంగంలోనూ, ఇటు రాజకీయాల్లోనూ రాణించి తెలుగునాట‌ నాయిని నర్సింహారెడ్డి తనదైనముద్ర వేసుకున్నారు.

Next Story