21 గంటల తరువాత చిక్కిన చిరుత..!

By జ్యోత్స్న  Published on  14 Dec 2019 2:56 AM GMT
21 గంటల తరువాత చిక్కిన చిరుత..!

ఒక చిరుతపులి దాదాపు మూడు రోజుల పాటు జైపూర్ వాసులను గడగడలాడించింది. దొరక్కుండా తప్పించుకుంటూ అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. సుమారు 21 గంటల సుదీర్ఘ గాలింపు చర్యల అనంతరం, అటవీ అధికారులు రాజస్థాన్‌ జైపూర్ లోని లాల్‌ కోఠీ ప్రాంతంలో దీనిని పట్టుకున్నారు. మత్తుమందు ఇచ్చిన బోనులో బంధించారు. పట్టణంలోని తక్తేషాహీ రోడ్డులో చిరుత కనపడినప్పటి నుంచి ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. రంగం లోకి దిగిన అధికారులు స్థానికులు కిటికీలు, తలుపులు వేసుకొని జాగ్రత్తగా ఉండాలని, రాత్రిపూట మరింత అప్రమత్తం గా ఉండాలని సూచించారు. చిరుతపులి కనపడితే తక్షణం అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రకటించారు.

ఇక శుక్రవారం పరిసరాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చిరుత ఈ ఉదయం పట్టణంలోని ఎస్సెమ్మెస్‌ స్టేడియంలో మొదట కనిపించింది. అనంతరం లాల్‌ కోఠీ దగ్గర ప్రత్యక్షమై అక్కడి వారికి చెమటలు పట్టించింది. చివరికి అటవీ, పోలీసు శాఖ అధికారులు సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యలు ఫలించాయి. చిరుతకు మత్తుమందు ఇచ్చిన అధికారులు దానిని బోనులో బంధించారు. చిరుతను వెతికిపట్టే ప్రయత్నంలో ఇద్దరు అటవీ అధికారులు గాయపడినట్టుగా తెలుస్తోంది. చిరుత ఝలానా అటవీ ప్రాంతం నుంచి నగరంలోకి ప్రవేశించి ఉంటుందని జిల్లా అటవీ అధికారులు భావిస్తున్నారు. మొదట యూనివర్సిటీ ప్రాంతం లోకి ప్రవేశించిన చిరుత, తరువాత మోదీ డోంగ్రీ గుట్టల్లోకి వచ్చి ఉంటుందని చెబుతున్నారు.

Next Story