మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఇతర రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దర్యాప్తు అధికారులను సాక్షులు బెదిరిస్తున్నారని, కేసును ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీలో జరుగుతున్న విచారణపై తమకు నమ్మకం లేదని పిటిషనర్ ఎత్తిచూపారు. హైకోర్టు విశ్రాంత జడ్జి పర్యవేక్షణలో దర్యాప్తు సాగాలని సునిత తరఫు న్యాయవాది చెప్పారు. కాలపరిమితితో కూడిన విచారణ జరగాలని కోరారు.
కేసును ఏ రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుకుంటున్నారని ప్రతివాదులు ఉమాశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి తరపు న్యాయవాదులను అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. విచారణకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేయవద్దని, కర్ణాటకను ఖరారు చేయవచ్చని సీబీఐ న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే కేసును తెలంగాణకు బదిలీ చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సునీత తరఫు న్యాయవాదులు తెలిపారు. దర్యాప్తులో జాప్యం చేస్తున్న సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2019 మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో వివేకాను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.