ఇస్లాం ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. నిరుద్యోగి అరెస్ట్
ఇస్లాంకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేసినందుకు గాను 27 ఏళ్ల నిరుద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 5 Oct 2023 10:24 AM ISTCrime, Goa, india, prophet
ఇస్లాం, ప్రవక్త ముహమ్మద్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేసినందుకు గాను 27 ఏళ్ల నిరుద్యోగిని గోవా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబరు 30న, ముస్లిం సమాజం మనోభావాలను దెబ్బతీసే విధంగా కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో పరువు నష్టం కలిగించే సందేశాలను పోస్ట్ చేయడంతో గోవాలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించి పనాజీ, మార్గోవ్, పోండా, మపుసా తదితర ప్రాంతాల్లో ముస్లిం సంస్థలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఆ తర్వాత దక్షిణ గోవాలోని పోండా, మార్గోవ్ పోలీస్ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాలను సృష్టించి ప్రవక్త ముహమ్మద్, ఇస్లాంకు వ్యతిరేకంగా కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను అరెస్టు చేయాలని వారు సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశారు. పోలీసు సూపరింటెండెంట్ (సైబర్ క్రైమ్) అక్షత్ కౌశల్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధాన నిందితులలో ఒకరిని పట్టుకున్నట్లు తెలియజేశారు. ఈ కేసులో ఇదో పెద్ద పురోగతి అని తెలిపారు. ''పొండా, మార్గోవ్ పోలీస్ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. నిందితుడిని వారికి అప్పగించారు, తదుపరి అరెస్టు ప్రక్రియను చేపడతారు'' అని అక్షత్ కౌశల్ తెలిపారు.
సైబర్ పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారని, సోషల్ మీడియా కంపెనీలకు విదేశాల్లో సర్వర్‌లు ఉన్నందున వారి వివరాలను తెలుసుకోవడం వారికి పెద్ద సవాలుగా ఉందని ఆయన అన్నారు. “ఈ కేసులో మరింత మంది వ్యక్తులను అరెస్టు చేసే అవకాశం ఉన్నందున మేము ప్రస్తుతం నిందితుడి పేరును వెల్లడించలేము. అతను స్థానిక నివాసి, అతను వైద్య చికిత్స పొందుతున్నాడు” అని అతను చెప్పాడు. నిందితుడి వైద్య పత్రాలు ధృవీకరించబడతాయి. విచారణ ప్రాథమిక దశలో ఉందని, ఎన్ని ఖాతాలు క్రియేట్ అయ్యాయో, అందులో ప్రమేయం ఉన్న వ్యక్తులెవరో పోలీసులు తేలుస్తారని చెప్పారు.