అదో ప్రభుత్వాసుపత్రి. రోగులతో కిటకిటలాడుతోంది. అక్కడి వైద్యుడు రోగులను చూడడంతో బిజీగా ఉన్నాడు. ఇంతలో ఓ యువకుడు అక్కడి వచ్చాడు. డాక్టర్ గారు ఈ పామే నన్ను కాటేసిందని చెబుతూ..తాను చేతిలో పట్టుకువచ్చిన పామును చూపించాడు. అంతే.. అక్కడే ఉన్న డాక్టర్‌తో పాటు అక్కడి రోగులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అతడి చేతిలో ఆరు అడుగుల నాగుపాము ఉంది. అది ఇంకా బతికే ఉండడంతో దాన్ని చూసిన కొందరు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఝోరింగా యువి 51 (ఉమ్మర్ కోట్ విలేజ్ 51) చోటాగుడ గ్రామంలో సుధాంశు సీల్ (35) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఎప్పటిలాగే బుధవారం కూడా పొలంలో పనిచేస్తున్నాడు. అయితే.. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో తెలీదు కానీ.. ఓ ఆరుఅడుగుల నాగుపాము అతడి కాలి మీద కాటువేసింది. అయితే.. పాము కరిచినప్పటికి భయపడకుండా సుధాంశు వెంటనే ఓ చేతితో పామును పట్టుకున్నాడు. వెంటనే బైక్‌పై ఆ పాముతో పాటే నవరంగపూర్ జిల్లా ఉమ్మరకోట్ సామాజిక ఆస్పత్రికి చేరుకున్నాడు.
చేతిలో పాముతో వచ్చిన సుధాంశును చూసిన వారంతా భయంతో వణికిపోయారు. డాక్టర్‌కు పామును చూపించిన అనంతరం ఆ పామును ఓ సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టాడు. అతడికి డాక్టర్ ప్రాథమిక వైద్యం అందించారు. అయితే.. నాగు పాము కాటు వేసినా సుధాంశు చలించక పోవడం, కాటు వేసి కొన్ని గంటలైనా ఏమీకాక పోవడంతో డాక్టర్లు సైతం ఆశ్యర్య పోయారు. ప్రస్తుతం అతడు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు.