'నన్ను జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టవచ్చు కానీ.'. సిసోడియా ట్వీట్

న‌న్ను జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టవచ్చు నా ఆత్మ‌స్థైర్యాన్ని దెబ్బ‌తీయ‌లేరు అని మ‌నీష్ సిసోడియా అన్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 March 2023 7:13 AM GMT
Manish Sisodia, Delhi liquor scam

మనీష్ సిసోడియా

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్ర‌స్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడీ) క‌స్ట‌డీలో ఉన్నారు. తాజాగా ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ)పై విరుచుకు ప‌డ్డారు. త‌న‌ను జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్ట‌వ‌చ్చు గానీ త‌న ఆత్మ‌స్థైర్యాన్ని దెబ్బ‌తీయ‌లేర‌ని అన్నారు.

"స‌ర్‌.. నన్ను జైలులో పెట్టడం ద్వారా నన్ను ఇబ్బంది పెట్టవచ్చు. కానీ నా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ‌తీయ‌లేరు." అని ట్వీట్ చేశారు, భారతీయ సాత్వంత్య్ర‌ సమరయోధులు బ్రిటిష్ వారిచే ఇబ్బందులకు గురైన రోజులను కూడా గుర్తు చేసుకున్నారు. 'బ్రిటీష‌ర్లు కూడా సాత్వంత్య్ర‌ స‌మ‌ర‌యోధుల‌ను ఇబ్బందుల‌కు గురి చేశారు. అయినా కానీ వారి స్థైర్యాన్ని క‌దిలించ‌లేక‌పోయారు.' అని అన్నారు.

రౌస్ అవెన్యూ కోర్టులో శుక్ర‌వారం సిసోడియా బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిగింది. సిసోడియాను క‌స్ట‌డికీ అప్ప‌గించాల‌న్న ఈడీ అభ్య‌ర్థ‌న‌కు అనుకూలంగా న్యాయ‌స్థానం తీర్పునిచ్చింది. ఆయ‌న్ను ఏడు రోజుల పాటు ఈడీ క‌స్ట‌డీకి అప్ప‌గించింది. మ‌రోవైపు సీబీఐ కేసులో ఆయ‌న బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ‌ను మార్చి 21కి వాయిదా వేసింది.

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దాదాపు ఎనిమిది గంటల విచారణ అనంతరం ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. మనీష్ సిసోడియాను ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 120 బి (నేరపూరిత కుట్ర), 477 ఎ (మోసం చేయాలనే ఉద్దేశ్యం) మరియు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద అరెస్టు చేశారు. మనీష్ సిసోడియా సమాధానాలు సంతృప్తికరంగా లేవని, విచారణకు ఆయన సహకరించడం లేదని సీబీఐ పేర్కొంది.

ఒక రోజు తర్వాత సిసోడియాను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఐదు రోజుల కస్టడీకి పంపింది, దానిని రెండు రోజుల పాటు పొడిగించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిసోడియా, సత్యేంద్ర జైన్‌లు మార్చి 1న తమ రాజీనామాలను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు అందజేశారు.

Next Story