ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియాను వారం పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి పంపుతూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ పాలసీ కేసులో ఆయనకు ఏడు రోజుల కస్టడీ విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో మనీశ్ సిసోడియాకు ప్రత్యక్ష పాత్ర ఉన్నదని, ఆయన ఆదేశాలతోనే లిక్కర్ పాలసీలో మార్పులు చేసి ఎంపిక చేసుకున్న కొందరు వ్యక్తులు భారీగా లబ్ది చెందేలా రూపొందించారని ఈడీ వాదించింది. లిక్కర్ పాలసీలో మనీశ్ పాత్ర ప్రత్యక్షంగా ఉన్నట్టు ఆధారం ఉందని.. ఆయనను విచారణకు సహకరించడం లేదని ఆరోపించింది. మనీశ్ సిసోడియాను పది రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ కోరింది. ఈడీ విజ్ఞప్తిని ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు అంగీకరించింది. మనీశ్ సిసోడియాను ఏడు రోజుల ఈడీ కస్టడీకి పంపించడానికి అంగీకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఫిబ్రవరి 26న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసిన సిసోడియాను మార్చి 20 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన మద్యం పాలసీ వివాదంలో చిక్కుకుంది.