ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ ఇటీవలి కాలంలో ఎన్నో వివాదాల్లో నిలిచారు. ఆయన ఇటీవలే మహిళల చిరిగిపోయిన జీన్స్ మీద చేసిన కామెంట్లు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపాయి. భారత్‌ను 200 ఏండ్లు అమెరికా పాలించిందని, భారతీయులను బానిసలుగా చేసిందని, కానీ ఇప్పుడు అమెరికా కరోనా వైరస్ ని అదుపు చేయలేక సతమతమవుతోందని అనడం కలకలం రేపింది. తాజాగా ఆయన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కరోనా నేపథ్యంలో పేద కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయని... వారికి ప్రభుత్వం ఇస్తున్న ఎక్కువ రేషన్ కావాలంటే ఎక్కువ మంది పిల్లలు ఉండాలని చెప్పారు. ఒక్కో వ్యక్తికి నెలకు 5 కిలోల బియ్యం ఇస్తున్నామని... ఒక కుటుంబంలో 10 మంది ఉంటే 50 కేజీలు అందుతున్నాయని తెలిపారు. 20 మంది కుటుంబ సభ్యులున్న వారికి క్వింటా బియ్యం వస్తోందని, దీంతో ఇద్దరు కుటుంబ సభ్యులు ఉన్నవారు ఓర్చుకోలేపోతున్నారని అన్నారు. మీకు సమయం ఉన్నప్పుడు కేవలం ఇద్దరు పిల్లలను మాత్రమే కన్నారని, 20 మందిని ఎందుకు కనలేదని ఆయన ప్రశ్నించారు.
తాజాగా తీరత్ సింగ్ రావత్ కు కరోనా సోకింది. తనకు నిర్వహించిన కరోనా టెస్టులో పాజిటివ్ అని తేలిందని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం బాగానే ఉన్నానని... ఎలాంటి ఆందోళన చెందడం లేదని చెప్పారు. హోమ్ ఐసొలేషన్ లో ఉన్నానని... డాక్టర్లు తన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ఇటీవలి కాలంతో తనకు కాంటాక్ట్ లోకి వచ్చిన వచ్చిన వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరారు.