కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యడియూరప్పకు పెను ప్రమాదం తప్పింది. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో సమస్య తలెత్తడంతో వెంటనే అప్రమత్తమైన పైలట్.. హెలికాప్టర్ ను గాల్లోకి లేపి తర్వాత సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కర్ణాటకలో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా.. ప్రచారంలో యడియూరప్ప కీలకంగా వ్యవహరిస్తున్నారు. విజయ్ సంకల్ప్ యాత్రలో పాల్గొనేందుకు సోమవారం ఆయన వెళ్తుండగా కర్ణాటకలోని కల్బుర్గిలో ఈ ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ దిగాల్సిన హెలిపాడ్ వద్ద ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలు పోగయ్యాయి. ల్యాండింగ్ సమయంలో గాలికి ప్లాస్టిక్ కవర్లు చాపర్ ను చుట్టుముట్టాయి. దీంతో పైలట్ చివరి నిమిషంలో చాకచక్యంగా హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయకుండా ముందుకు తీసుకు వెళ్లారు. తర్వాత అధికారులు క్లియరెన్స్ ఇవ్వడంతో సురక్షితంగా హెలికాప్టర్ ను ల్యాండ్ చేశారు. ఈ ఘటన కారణంగా యడియూరప్ప పర్యటన వాయిదా పడింది. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.