యాస్ సైక్లోన్ LIVE అప్డేట్స్
Yaas Cyclone LIVE updates. తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం నేడు తుపానుగా, రేపు అతి తీవ్ర తుపానుగా
By Medi Samrat Published on 24 May 2021 1:56 PM ISTతూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం నేడు తుపానుగా, రేపు అతి తీవ్ర తుపానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం ఇది పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయంగా 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉత్తరవాయవ్య దిశగా కదులుతోంది. 'యాస్' తుపాను రాగల 24 గంటల్లో అతి తీవ్రంగా మారనుంది. ఈ నెల 26న సాయంత్రం ఒడిశాలోని పారాదీప్, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 'యాస్' కారణంగా అండమాన్ నికోబార్ దీవుల్లో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. 27వ తేదీ వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే వరకు గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, తీరం దాటే సమయంలో ఈ వేగం 155-165 నుంచి 185 కిలోమీటర్ల వరకు ఉంటుందని తెలిపారు. మత్స్యకారులు ఎవరూ చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.
యస్ తుపాను ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వర్చువల్ పద్ధతిలో సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అమిత్ షాతో మాట్లాడి పలు వివరాలు తెలిపారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అమిత్ షా ఆయా రాష్ట్రాలకు సూచనలు చేస్తున్నారు. ఈ సమావేశంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ దేవేంద్ర కుమార్ జోషి కూడా పాల్గొన్నారు.
ఈ నెల 29 వరకు 25 రైళ్లను రద్దు చేసినట్టు తూర్పు రైల్వే తెలిపింది. పెను తుపానుగా మారే అవకాశం ఉండడంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. శనివారం 59 రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ ఆదివారం మరిన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. నేటి నుంచి 30వ తేదీ మధ్య రైళ్లను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. వీటిలో నిజాముద్దీన్, హౌరా, సంత్రగచ్చి, తిరువనంతపురం, చెన్నై సెంట్రల్, వాస్కోడిగామా, పాట్నా, పురులియా, కన్యాకుమారి, తాంబ్రం, యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరే రైళ్లు ఉన్నాయి.