భర్తతో కిడ్నీ అమ్మించిన భార్య, రూ.10 లక్షలతో ప్రియుడితో పరార్
By Knakam Karthik
భర్తతో కిడ్నీ అమ్మించిన భార్య, రూ.10 లక్షలతో ప్రియుడితో పరార్
వెస్ట్ బెంగాల్‌లోని హౌరాకు చెందిన ఓ మహిళ భర్తకు మాయమాటలు చెప్పి కిడ్నీ అమ్మించింది. ఆర్థిక పరిస్థితిని మెగురుపరిచేందుకు, తమ 12 ఏళ్ల కుమార్తెను మెరుగైన పాఠశాలలో చేర్పించేందుకు అతని కిడ్నీని విక్రయించాలని భర్తను ఒప్పించింది. భర్త కిడ్నీ అమ్మేస్తే ఆర్థికంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని అతడిని మోటివేట్ చేసింది. భార్య మాటలు నమ్మి కిడ్నీ కొనుగోలుదారుల కోసం ఏడాది కాలం వెతకగా మూడు నెలల క్రితం బయ్యర్లు దొరికారు. కిడ్నీ అమ్మేశాక, రూ.10 లక్షల డబ్బులు చేతికి వచ్చాక భార్య అసలు ప్లాన్ బయటపడింది. రూ.10 లక్షలు తీసుకుని ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ వ్యక్తితో పరారైంది. ఖంగుతిన్న భర్త అనివార్యంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు, 12 ఏళ్ల కుమార్తెను మెరుగైన పాఠశాలలో చేర్పించేందుకు అతడి కిడ్నీ అమ్మాలని ఏడాది కాలంగా భర్తపై మహిళ ఒత్తిడి చేస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు అంగీకరించి గత నెలలో శస్త్రచికిత్స అనంతరం రూ.10 లక్షలు ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడు అతని భార్య విశ్రాంతి తీసుకొని కోలుకోవాలని సూచించింది. ఆ తర్వాత ఒకరోజు ఆమె ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు. అల్మరా నుండి 10 లక్షల రూపాయల నగదుతో పాటు మరికొంత మొత్తం కనిపించకుండా పోయిందని గుర్తించినట్లు బాధితుడు కంప్లయింట్‌లో తెలిపాడు.
ఇక స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయంతో ఆమెను కోల్‌కతాలో గుర్తించారు. సంవత్సరం క్రితం ఫేస్ బుక్‌లో పరిచయమైన వ్యక్తితో సదరు మహిళ నివసిస్తోందని ఐడెంటిఫై చేశారు. కుటుంబసభ్యులు ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించగా వారితో మాట్లాడటానికి ఆమె నిరాకరించింది. అత్తమామలు తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ, భర్తతో విడాకుల కోసం దరఖాస్తు చేస్తానని ప్రియుడితో చెప్పించింది. అయితే అల్మరా నుంచి కిడ్నీ అమ్మగా వచ్చిన డబ్బులును తీసుకురాలేదని, ఆమె తన సేవింగ్స్ డబ్బులను మాత్రమే తీసుకువచ్చిందని ప్రియుడు చెప్పడం గమనార్హం. దీంతో తనకు, పిల్లలకు న్యాయం చేయాలని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.