ముగ్గురు పిల్లలను వదిలేసి, ఇంటర్ విద్యార్థిని మూడో పెళ్లి చేసుకున్న మహిళ
అప్పటికే వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్న 26 ఏళ్ల మహిళ 12వ తరగతి విద్యార్థిని వివాహం చేసుకుంది.
By Knakam Karthik
ముగ్గురు పిల్లలను వదిలేసి, ఇంటర్ విద్యార్థిని మూడో పెళ్లి చేసుకున్న మహిళ
ఉత్తరప్రదేశ్‌లో ఈ మధ్య కాలంలో చాలా వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల భార్యను ప్రియుడికి ఇచ్చి వివాహం జరిపించిన ఘటన మరవకముందే తాజాగా మరో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పటికే వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్న 26 ఏళ్ల మహిళ 12వ తరగతి విద్యార్థిని వివాహం చేసుకుంది. గతంలో షబ్నం అని పిలువబడే ఆ మహిళ ఇప్పుడు వేరే మతంలోకి మారిన తర్వాత శివాని అనే పేరుతో ఆ విద్యార్థిని పెళ్లి చేసుకుంది. అయితే ఇది ఆమెకు మూడో వివాహం కావడం గమనార్హం.
తన పొరుగున నివసించే వేరే వర్గానికి చెందిన 12వ తరగతి విద్యార్థితో శివాని ప్రేమలో పడింది. అయితే ఆమె తన రెండో భర్తకు విడాకులు ఇచ్చి, తన ముగ్గురు కుమార్తెలను అతని దగ్గర వదిలేసి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆ 12వ తరగతి విద్యార్థిని స్థానిక ఆలయంలో వివాహం చేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానిక పెద్దలు కొన్ని రోజుల క్రితం రెండు కుటుంబాలను పిలిచి పంచాయితీ నిర్వహించారు. వయస్సులో ఆ మహిళ పెద్దది కావడంతో ఆమె కోరుకున్న చోటనే నివసించేందుకు స్వేచ్ఛ ఉందని నిర్ణయించారు.
కాగా ఈ వివాహంపై శివాని మాట్లాడుతూ..ఇష్టానుసారమే పెళ్లి చేసుకున్నానని, ఈ నిర్ణయంతో సంతృప్తిగా ఉందని తెలిపింది. అటు విద్యార్థి కూడా అదే విధంగా స్పందిస్తూ.. తాము సంతోషంగా ఉన్నామని, తమ వివాహం విషయంలో ఎవరి జోక్యం కోరుకోవడంలేదని తెలిపాడు. ఇక తన కొడుకు నిర్ణయానికి తాను కూడా మద్దతు ఇస్తున్నట్లు విద్యార్థి తండ్రి తెలిపాడు.
గతంలో షబ్నం అలియాస్ శివాని అలీఘర్‌లో వివాహం చేసుకుంది. కానీ ఆ జంట తరువాత విడాకులు తీసుకున్నారు. ఆమె రెండవ వివాహం దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగింది. ఒక సంవత్సరం క్రితం, ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో గాయపడి వికలాంగుడయ్యాడు. ఆ తర్వాత ఆమె టీనేజర్‌తో సంబంధం ప్రారంభమైంది. ఇది కాస్త వివాహం వరకు దారి తీసింది.